ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. ఈ ప్రేమకథలను కొత్తగా ప్రజెంట్ చేయగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకంతో దర్శకులు సరికొత్త ప్రేమకథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ కోవలోనే 'బేబీ' సినిమాతో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డును అందుకున్న సాయిరాజేష్ తన కథతో, ఎస్కేఎన్తో కలిసి నిర్మించిన చిత్రం 'చెన్నై లవ్‌స్టోరీ'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. ఈ చిత్రం ప్రచారంలో ముందు నుంచే ఇదొక కల్ట్ బ్లాక్‌బస్టర్ అనే ట్యాగ్‌ను యాడ్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? ఈ ప్రేమకథలో అందరి హృదయాలను హత్తుకునే అంశాలున్నాయా? లేదా? అనేది చిత్ర సమీక్షలో తెలుసుకుందాం...
నివి (శ్రీ గౌరి ప్రియ) మూడేళ్లుగా ప్రేమించిన అబ్బాయి అజయ్ (త్రిగుణ్)ని పెళ్లి చేసుకోని అందమైన జీవితాన్ని గడపాలని ఊహించుకుంటుంది. కానీ పెళ్లి ముహూర్త సమయానికి అజయ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను మరో అమ్మాయిని ఇష్టపడుతున్నానని, నివికి బ్రేకప్ చెప్పి బెంగళూరు వెళ్లిపోతాడు. ఈ సంఘటనతో షాక్‌లో ఉన్న ఆమె మనసు ముక్కలైపోతుంది. ఈ బాధని మరిచిపోవడానికి తన స్నేహితులతో కలిసి చెన్నై వెళ్లిపోతుంది. ఊరు మారినా తన మనసు మారదు. విఫలప్రేమ బాధ నుంచి బయటపడటానికి ఆల్కహాల్‌కు అలవాటుపడుతుంది.
ఈ సమయంలోనే సినిమా రంగంలో దర్శకత్వ అవకాశం కోసం వేచి చూస్తున్న అనాథ స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) నివి స్నేహితులు ఉండే ఇంట్లోనే ఆశ్రయం సంపాందిస్తాడు. ఆ ఇంట్లో అందరితో సరదాగా ఉండే స్టీవెన్ పనులు మాత్రం నివికి విసుగు తెప్పిస్తాయి. స్టీవెన్ విషయంలో తన ప్రవర్తన కరెక్ట్ కాదని తెలుసుకున్న తను క్రమంగా అతడ్ని ఇష్టం పడటం మొదలుపెడుతుంది. స్టీవెన్ మాత్రం ఆమెను ఓ దేవతలా ఆరాధిస్తుంటాడు. ఓ రోజు సడన్‌గా 'మనం పెళ్లి చేసుకుందామా' అని అడుగుతుంది. అప్పుడు స్టీవెన్ ఏం చేశాడు? వీళ్ల ప్రేమకథ సక్సెస్ అవుతుందా? పెళ్లిపీటల మీద పెళ్లిని కాదని వెళ్లిపోయిన అజయ్ మళ్లీ నివి జీవితంలోకి ఎందుకొచ్చాడు? స్టీవెన్ శంకర్‌కు దర్శకత్వ చాన్స్ వచ్చిందా? నివి ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది మిగతా కథ.
''ప్రతి ప్రేమకథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదండీ'' అనే ఓ డైలాగ్ ఈ చిత్రంలో ఉంటుంది. అందుకే ఈ చిత్ర కథా రచయిత ఈ ప్రేమకథను చాలా కొత్తగా ఆలోచించాడు. ''తొలిప్రేమ ఎప్పటికీ మధుర జ్క్షాపకమే. అది మనసు పొరల్లో శాశ్వతంగా ఉండిపోతుంది'' అంటూ 'బేబీ'తో హృదయానికి హత్తుకునే ప్రేమకథను చెప్పిన.. దర్శకుడు సాయి రాజేష్.. ఈసారి తొలి ప్రేమ తోపు కాదు అంటూ మరో వినూత్న ప్రేమకథను 'చెన్నై లవ్‌స్టోరీ'తో అందించాడు. అయితే ఈ లవ్‌స్టోరీ చాలా నిదానంగా ప్రారంభమవుతుంది. ఇక స్టీవెన్ శంకర్ పాత్ర ప్రవేశంతో కథ ఊపందుకుంటుంది. ఆయన పాత్రలోని అమాయకత్వం, చలాకీతనంతో ప్రేక్షకులు ప్రేమలో పడిపోతారు. ప్రతి సన్నివేశం ఎంతో ఆహ్లాదంగా ముందుకు సాగుతుంది. కథానాయిక పాత్ర కూడా ఆసక్తికరంగా మలచడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కథనం హాయిగా సాగిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో మార్పు కోసం హీరో చేసే అల్లరి పనులు, తానొక అనాథ అని హీరో చెప్పే సన్నివేశంలోని ఎమోషన్ అందరి హృదయాలను కదిలిస్తుంది.
ఫస్టాఫ్‌లో వచ్చే గుర్తుందా పాట అలరిస్తుంది.ఇక ఇంటర్వెల్‌కు సమయానికి కథ షాకింగ్ టర్న్ తీసుకుంటుంది. ఈ సీక్వెన్స్ చూశాక దర్శకుడు సెకండాఫ్‌ను ఎలా డీల్ చేస్తాడా? అనే ఆసక్తి అందరిలో మొదలవుతుంది. అయితే దర్శకుడు ముందే ఇచ్చిన హింట్స్ ప్రకారం దాదాపు అందరూ ద్వితీయార్థాన్ని ఊహించుకుంటూనే సెకండాఫ్‌లోకి ఎంట్రీ అవుతారు. డైరెక్టర్‌కి ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. తన కన్వీనెంట్‌గా సన్నివేశాలు రాసుకుని, కొత్తదనం కోసం ప్రయత్నించినా అది కన్వీన్సింగ్‌గా అనిపించదు. తాను సెకండాఫ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలతో దర్శకుడు రిజిష్టర్ చేసే ప్రయత్నం చేసి ఆడియన్స్‌ను ప్రీపేర్ చేసిన భావన కలుగుతుంది.
అందరూ ఊహించునట్టుగానే సెకండాఫ్‌లో ఈ లవ్‌స్టోరీ కాస్త తడబడింది.. అయితే కొన్ని హార్ట్ టచ్చింగ్ సీన్స్‌తో దర్శకుడు కథను ఎక్కడ పడిపోతున్న ఫీల్ కలగకుండా మేనేజ్ చేశాడు. ఈ సినిమా ద్వితీయార్థం చూస్తున్నప్పుడు కొన్ని ఆలెడ్రీ చూసిన సినిమాలు గుర్తుకొచ్చినా.. మరో బలమైన సన్నివేశంతో ఆ భావనను ఆడియన్స్ మైండ్‌లో నుంచి తుడిచిపెట్టే విధంగా దర్శకుడు సెకండాఫ్‌ని హ్యాండిల్ చేశాడు. ద్వితీయార్థంలో కుక్కల ఫైటింగ్.. స్మశానంలో హీరోయిన్ సీన్, పతాక సన్నివేశాలు కీలకంగా నిలిచాయి. అయితే సెకండాఫ్‌ను రచనా పరంగా మరింత బలంగా రాసుకుని ఉంటే కథనం ప్రేక్షకుల ఊహకు అందకుండా థ్రిల్ల్‌ను కలిగించేంది.
ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం నటన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్టీవెన్ శంకర్‌గా ఆయన పర్ఫార్మెన్స్లో మెచ్యూరిటి కనిపించింది. ఎంతో నేచురల్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాతో నటుడిగా ఆయన మరో మెట్టు ఎక్కాడు. నివి పాత్రలో గౌరీప్రియ అలరించింది. ఓ కథానాయికకు ఇలాంటి పాత్ర లభించడం చాలా అరుదు. ఆమె తన పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. లవ్‌ఫెయిల్యూర్ అమ్మాయిలా ఆమెలోని భావోద్వేగపూరిత నటన అందరి హృదయాలను హత్తుకుంటుంది. త్రిగుణ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.
స్నేహితులుగా సిరి హనుమంతు, పూజ, నవీన్, కార్తీక్‌లు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు రవి నంబూరి అనుభవం ఉన్న దర్శకుడిలా ఇలాంటి సెన్సిటివ్ లవ్‌స్టోరీని తెరపై చక్కగా ఆవిష్కరించాడు. దర్శకులు పి.వాసు, కరుణకుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది. సాంకేతిక పరంగా ఆయనకే ఎక్కువ మార్కులు పడతాయి. పాటలన్నీ క్యాచీగా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం చిత్రంలోని సోల్‌ను నిలబెట్టింది. ఈ మధ్య కాలంలో మూడు గంటలపైగా నిడివితో విడుదలైన చిన్న సినిమా ఇదే. సినిమా లెంగ్త్ పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపించకపోయినా, ట్రీమ్ చేసుకునే స్కోప్ మాత్రం కనిపించింది.
కొత్త తరహా ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'చెన్నై లవ్‌స్టోరీ'లో ప్రేమ గొప్పదనాన్ని, ప్రేమలోని నిజాయితీని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన సరికొత్త ప్రేమకథల్లో ఈసినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, సెన్సిబులిటీస్ మేళవించిన ఈ ప్రేమకథలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా, ప్రేమకథలను ఇష్టపడే అందరి హృదయాలను హత్తుకుంటుంది.
'చెన్నై లవ్‌స్టోరీ' మూవీ రివ్యూ..
