నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లు, ధరల పెరుగుదల వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమాలు రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నిరుద్యోగం పెరగడం, వరుసగా పేపర్‌ లీక్‌లు జరగడం, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని వేణుగోపాల్‌ చెప్పారు.

ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలు పెరుగుతూనే ఉన్నాయని విమర్శించింది. మరోవైపు ఉద్యోగావకాశాలు తగ్గిపోవడంతో యువత భవిష్యత్తుపై ఆందోళన చెందుతోందని పేర్కొంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి కూడా దెబ్బతిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

అలాగే మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడాలని పార్టీ నిర్ణయించినట్లు వేణుగోపాల్‌ వెల్లడించారు.