విద్యుత్‌ను కనిపెట్టింది ఆధునిక శాస్త్రమే అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ రెండు వేల ఏళ్ల క్రితమే విద్యుత్‌కు సంబంధించిన పరిజ్ఞానం మనిషికి ఉండి ఉండొచ్చా? అనే ప్రశ్నకు కారణమైన పురాతన వస్తువు ఒకటి ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదే ‘బాగ్దాద్‌ బ్యాటరీ’. ఈ చిన్న మట్టి పాత్ర అసలు ఉపయోగం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తేలకపోయినా, ఇది ప్రాచీన నాగరికతల సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తిని పెంచుతోంది.

చిన్న పాత్రలో పెద్ద మిస్టరీ
‘బాగ్దాద్‌ బ్యాటరీ’గా పిలిచే వస్తువు మట్టి పాత్రతో తయారైంది. దీన్ని 1936లో ఇరాన్‌ రాజధాని బాగ్దాద్‌కు సమీపంలోని ఖుజుత్‌ రాబు అనే ప్రదేశంలో లభించింది. జర్మన్‌ పురావస్తు శాస్త్రవేత్త విల్హెమ్‌ కోనిగ్‌ దీన్ని గుర్తించారు. 1938లో వివరాలు వెల్లడించారు. ఇందులో రాగి గొట్టం, ఇనుప కడ్డీ అమర్చి ఉన్నాయి. పాత్రలో వెనిగర్‌ లేదా ద్రాక్షరసం వంటి ఆమ్ల స్వభావం ఉన్న ద్రవాన్ని నింపితే స్వల్ప స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే దీనిని ప్రపంచంలో తొలి బ్యాటరీగా కొందరు అభివర్ణించారు.

అసలు ఉపయోగంపై భిన్నాభిప్రాయాలు
ఈ వస్తువు నిజంగానే విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఉపయోగించారా అన్న విషయంపై మాత్రం ఏకాభిప్రాయం లేదు. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం బంగారం, వెండి వంటి లోహాలపై పలుచటి పూత వేయడానికి దీనిని వినియోగించి ఉండొచ్చు. మరికొందరు మాత్రం ఇది సాధారణ నిల్వ పాత్ర లేదా మతపరమైన ఆచారాలకు ఉపయోగించిన వస్తువు కావచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు దీనికి మద్దతుగా స్పష్టమైన ఆధారాలు లభించలేదు.

వోల్టాకు చాలా ముందే
ఆధునిక బ్యాటరీని ఇటలీ శాస్త్రవేత్త అలెసాండ్రో వోల్టా 1800లో రూపొందించారు. అయితే ‘బాగ్దాద్‌ బ్యాటరీ’గా గుర్తించిన ఈ వస్తువు దాదాపు రెండు వేల ఏళ్ల నాటిదిగా భావిస్తున్నారు. దీంతో ప్రాచీన నాగరికతలకు విద్యుత్‌పై కొంత అవగాహన ఉండి ఉండొచ్చన్న చర్చ తరచూ తెరపైకి వస్తోంది. అయితే దీన్ని తొలి విద్యుత్‌ బ్యాటరీగా నిర్ధారించే ఆధారాలు ఇప్పటికీ లేవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.