హాలీవుడ్ చిత్రం ‘ది ఒడిస్సీ’లో తామర పువ్వు తినడంతో హీరో తన గతాన్ని, కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోతాడు. అయితే నిజ జీవితంలో అది నిజం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ తామర పువ్వు మనిషి జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తుందనడానికీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు.

కొత్త విషయాలను గుర్తుంచుకోవడం, వాటిని మెదడులో నిల్వ చేసుకోవడం, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం వంటి అనేక ప్రక్రియల సమాహారమే జ్ఞాపకశక్తి. కొన్ని మత్తు మందులు లేదా నిద్రమాత్రలు తాత్కాలికంగా కొత్త జ్ఞాపకాలు ఏర్పడకుండా చేయవచ్చు. కానీ గతంలో జరిగిన విషయాలన్నింటినీ పూర్తిగా మరిచిపోయేలా తామర పువ్వు ప్రభావం చూపదని నిపుణులు పేర్కొంటున్నారు.

కొన్ని విషపూరిత మొక్కలు లేదా రసాయన పదార్థాలు గందరగోళం, భ్రాంతులు, తాత్కాలిక జ్ఞాపక లోపానికి కారణమవుతాయి. అయితే వాటిని తామర పువ్వుతో పోల్చడం సరైంది కాదని చెబుతున్నారు. మార్కెట్లో లభించే కొన్ని ‘బ్లూ లోటస్’ ఉత్పత్తుల గురించి ప్రచారంలో ఉన్న మత్తు, మానసిక సమస్యల వాదనలను కూడా పూర్తిగా నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు.

హిందూ సంప్రదాయంలో తామర పువ్వుకు పవిత్రమైన స్థానం ఉంది. అలాగే తామర గింజలు (మఖానా), కాండం, రేకులు అనేక ప్రాంతాల్లో ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. మొత్తంగా తామర పువ్వు తినడం వల్ల సినిమా లేదా పురాణాల్లో చూపినట్లుగా జ్ఞాపకశక్తి పూర్తిగా పోతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.