టీ అంటే సాధారణంగా వందలు లేదా వేల రూపాయల ధర ఉండటం సహజం. కానీ చైనాకు చెందిన ‘డా హాంగ్ పావో’ (Da Hong Pao) అనే టీ మాత్రం కిలోకు రూ.9 కోట్లకు పైగా విలువ పలుకుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీగా గుర్తింపు పొందిన దీనికి కారణం దాని అరుదైన లభ్యత, శతాబ్దాల చరిత్ర, రాజవంశాలతో ముడిపడిన ప్రత్యేకత.

చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన వుయీ పర్వతాల్లో ఈ టీ పండుతుంది. ప్రస్తుతం అసలు ‘డా హాంగ్ పావో’ టీ కేవలం ఆరు ప్రాచీన మాతృ చెట్ల (మదర్ ట్రీ)ల నుంచే లభిస్తుంది. ఈ చెట్ల వయసు వందల ఏళ్లుగా ఉండటంతో వాటిని జాతీయ సంపదగా చైనా ప్రభుత్వం గుర్తించింది.

ఈ అరుదైన టీ ఆకుల కోసం గతంలో జరిగిన వేలంలో కేవలం 20 గ్రాముల టీనే రూ.లక్ష పైగా అమ్ముడైంది. అసలు డా హాంగ్ పావో టీ గ్రాము ధర బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత విలువైన టీగా భావిస్తారు.

ఈ ఆరు మదర్ ట్రీలను సంరక్షించేందుకు 2006లో చైనా ప్రభుత్వం వాటి నుంచి వాణిజ్యపరంగా ఆకులు కోయడాన్ని పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం మార్కెట్లో లభించే డా హాంగ్ పావో టీ అసలు చెట్ల నుంచి వచ్చిన మొక్కల నుంచి లేదా వాటి రుచికి దగ్గరగా ఉండే ప్రత్యేక ఊలాంగ్ టీ ఆకులతో తయారవుతోంది.

ఈ టీ వెనుక ఓ ఆసక్తికరమైన గాథ కూడా ఉంది. అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థి ఈ టీ తాగి కోలుకుని చక్రవర్తికి సేవ చేశాడని, కృతజ్ఞతగా చక్రవర్తి తన ఎర్రని రాజవస్త్రాన్ని ఆ టీ చెట్లపై కప్పించాడని చైనా జానపద కథలు చెబుతున్నాయి. అప్పటి నుంచే దీనికి ‘డా హాంగ్ పావో’ (బిగ్ రెడ్ రోబ్) అనే పేరు వచ్చింది.