సినీ హాస్య నటుడు, ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేశ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియడంతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రమేశ్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుప‌త్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే న్యూరాలజీ నిపుణుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స ప్రారంభించింది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మెరుగైన వైద్యం అందిస్తున్నారని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 2012లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ద్వారా రమేశ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో అంత్యాక్షరి గ్యాంగ్‌లో ఒకరిగా తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ సినిమా తర్వాత ఆయన పేరు ‘గబ్బర్ సింగ్ రమేశ్‌’గా స్థిరపడిపోయింది. ఈ చిత్రంలోని ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

‘గబ్బర్ సింగ్’ విజయం తర్వాత రమేశ్‌కు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్య వస్తావయ్యా’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి అనేక చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించారు. ఇటీవలే వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా ఆయన కనిపించారు.

కేవలం నటుడిగానే కాకుండా పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించి, పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు.