సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లకు మరో కొత్త సినిమా జతకానుంది. రోహిత్ నారా, హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్ గన్ని తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘కపాలి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రోహిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘తెలియని ప్రపంచంలోకి ప్రయాణం’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

‘కపాలి’ అంటే పుర్రెను ధరించినవాడు అనే అర్థం. ఆ భావానికి తగ్గట్టుగానే పోస్టర్‌ను డిజైన్ చేశారు. రోహిత్ నారా గంభీరమైన లుక్‌లో కనిపిస్తుండగా, తల వెనుక పురాతన చిహ్నాలు, కొమ్మల్లా విస్తరించిన ఆకృతులు మిస్టరీ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎర్రటి కళ్లతో భయపెట్టే మహిళా రూపం సినిమాలో అతీంద్రియ శక్తులకు కీలక పాత్ర ఉంటుందని సూచిస్తోంది.

ఈ కథ పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. పోస్టర్‌లో పోలీసు సిబ్బంది, పోలీస్ వాహనం, యాగవేదికను తలపించే వలయం కనిపించడం కథలో ఇన్వెస్టిగేషన్‌, మిస్టరీ, భయానక అంశాలు కలిసివస్తాయని సంకేతమిస్తోంది.

సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. రామ్ గన్ని కథతో పాటు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కీలక పాత్ర పోషిస్తుండగా, త్వరలోనే సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.