ఒకప్పుడు కారు కొనడం అంటే జీవితంలో పెద్ద మైలురాయి. సొంత ఇల్లు తర్వాత చాలామంది కల అదే. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా నగరాల్లో నివసించే ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ప్రశ్న వేసుకుంటున్నారు. ‘‘కారు కొనగలనా?’’ కాదు... ‘‘అసలు కారు కొనాల్సిన అవసరం ఉందా?’’ అని. పెరుగుతున్న ఈఎంఐలు, ఇంధన ధరలు, పార్కింగ్ సమస్యలు, నిర్వహణ ఖర్చులు చూసిన తర్వాత చాలామంది రెండో ఆలోచన చేస్తున్నారు. మరి నిజంగా కారు కొనడం ఇప్పటికీ ఆర్థికంగా సరైన నిర్ణయమేనా? ఒకసారి లెక్కలు చూద్దాం..
కొన్న రోజే కౌంట్‌డౌన్ మొదలు
రూ.20 లక్షల విలువైన కారు కొన్నారని అనుకుందాం. రూ.4 లక్షలు డౌన్ పేమెంట్ ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల రుణంగా తీసుకుంటే ప్రతి నెల ఈఎంఐనే దాదాపు రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు ఉంటుంది. అంతటితో ఖర్చు ఆగదు. రోజూ 50 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించే వారికి నెలకు ఇంధన ఖర్చు మరో రూ.20 వేల వరకు చేరొచ్చు. బీమా, సర్వీసింగ్, విడిభాగాల మార్పు, సాధారణ నిర్వహణ కలిపితే మరో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అంటే నెలకు సగటున రూ.60 వేలు దాటడం పెద్ద విషయం కాదు.
అసలు ఖర్చు ఇదే
కారు కొనే సమయంలో చాలా మంది పార్కింగ్ గురించి పెద్దగా ఆలోచించరు. కానీ అదే నగర జీవితంలో పెద్ద తలనొప్పిగా మారుతోంది. అపార్ట్‌మెంట్‌లో అదనపు పార్కింగ్‌కు డబ్బు చెల్లించాలి. ఆఫీసు దగ్గర ఖాళీ స్థలం కోసం వెతకాలి. మాల్స్, వాణిజ్య సముదాయాల్లో గంటల వారీగా పార్కింగ్ ఫీజు చెల్లించాలి. కొన్నిసార్లు పార్కింగ్ కోసం 15 నుంచి 20 నిమిషాలు తిరగాల్సి వస్తుంది. దీనికి తోడు షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చిన క్షణం నుంచే కారు విలువ తగ్గడం మొదలవుతుంది. ఇది నెలనెలా కనిపించకపోయినా, చివరకు పెద్ద ఆర్థిక భారం అవుతుంది.
కారు లేకపోతే ఎంత ఆదా అవుతుంది?
ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేందుకు, వారాంతపు ప్రయాణాలకు, విమానాశ్రయానికి వెళ్లడంతో పాటు ఇతర అవసరాలకు క్యాబ్‌లను వినియోగించే సగటు వ్యక్తి నెలకు సుమారు రూ.20-40 వేల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కారు ఖర్చుతో పెద్ద తేడా కనిపించకపోవచ్చు. కానీ క్యాబ్ వాడే వారికి ఈఎంఐ ఉండదు. సర్వీసింగ్ బాధ ఉండదు. బీమా రెన్యువల్, అనుకోని మరమ్మతులు, టైర్ల మార్పు, రీసేల్ విలువ తగ్గిపోవడం, పార్కింగ్ కోసం పడే ఇబ్బందులు ఏవీ ఉండవు. అవసరం ఉన్నప్పుడు ప్రయాణానికి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.
యువత ఆలోచన ఎందుకు మారుతోంది?
ఇప్పుడు చాలామంది యువ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, కార్పొరేట్ ఉద్యోగులు, తరచూ ప్రయాణాలు చేసే వారు కారు సొంతం చేసుకోవడం కంటే అవసరమైనప్పుడు వాహనం వినియోగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారికి సొంత కారు కంటే సౌకర్యం, ఖర్చు తగ్గడం, ఒత్తిడి లేకపోవడమే ముఖ్యమవుతోంది. అందుకే షేర్డ్ మొబిలిటీ, యాప్ ఆధారిత క్యాబ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది.
అయితే అందరికీ ఇదే వర్తించదు
పిల్లలు ఉన్న కుటుంబాలు, పెద్దవాళ్లు ఉన్న ఇళ్లు, తరచూ ఆసుపత్రులు, పాఠశాలలు.. ఇలా రోజూ చాలా దూరం ప్రయాణించే ఉద్యోగులకు మాత్రం సొంత కారు ఉండడమే మంచిది. అలాగే రాత్రి వేళల్లో తరచూ బయటకు వెళ్లాల్సి వచ్చినా, పని కోసం సామగ్రి తీసుకెళ్లాల్సి వచ్చినా, క్యాబ్‌లు సులభంగా దొరకని ప్రాంతాల్లో నివసించినా కారు ఉండటం ఆచరణాత్మకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చు కంటే సౌకర్యమే విలువైనదిగా మారుతుంది.
తుది లెక్క ఏంటంటే..
కారు కొనాలా వద్దా అనే నిర్ణయం హోదా కోసం తీసుకోవాల్సింది కాదు. మీ జీవనశైలి, ప్రయాణ అవసరాలు, నెలవారీ ఖర్చులు చూసుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. నెలలో ఎక్కువ రోజులు కారు పార్కింగ్‌లోనే ఉంటే ఈఎంఐలు, నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమే. అదే కుటుంబమంతా తరచూ వినియోగిస్తే, రోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే సొంత కారు ఇప్పటికీ మంచి పెట్టుబడిగానే ఉంటుంది. చివరకు ప్రశ్న ఒక్కటే.. కారు కొనగలరా అనేది కాదు.. మీరు నడిపే జీవితానికి కారు నిజంగా అవసరమా?
కారు కొనాలా? క్యాబ్‌తో సరిపెట్టుకోవచ్చా? ఈ లెక్కలు చూసి నిర్ణయించుకోండి!
