కృష్ణా నదికి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని జలాశయాలు నిండిపోవడంతో, అక్కడి నుంచి విడుదలవుతున్న వరద నీరు నేడు (బుధవారం) శ్రీశైలం జలాశయానికి చేరుకోనుంది. ఆలస్యంగానైనా వరద రాక మొదలవడంతో తెలుగు రాష్ట్రాల రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.

తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు నుంచి మంగళవారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేశారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు దాదాపు గరిష్ఠ మట్టానికి చేరుకోవడంతో భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ పూర్తి సామర్థ్యానికి కేవలం 4 టీఎంసీల దూరంలో ఉండటంతో, అక్కడి నుంచి సుమారు 80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా 84,300 క్యూసెక్కుల ప్రవాహం జూరాలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో, జూరాల క్రస్ట్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.

మంగళవారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇంకా వరద ప్రవాహం నమోదు కానప్పటికీ, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం జలాశయానికి పెద్ద ఊరటనివ్వనుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 41.279 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరోవైపు, తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 136.99 టీఎంసీలు, పులిచింతలలో 29.07 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, గోదావరి బేసిన్ లోని పోలవరం వద్ద వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది..