ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో పాటు తనను విమర్శించే వారికి కూడా ఒక కీలక సందేశాన్ని అందించారు. సోషల్ మీడియా వేదికగా సాగే ట్రోల్స్, ఫ్యాన్ వార్స్‌పై సమయం వృథా చేయకుండా, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో అల్లు అర్జున్ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
"నా అభిమానులకే కాకుండా, నన్ను ద్వేషించే వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇతరులపై విమర్శలు చేయడం సమంజసం కాదు. మనకు నచ్చని వ్యక్తుల కోసం మన విలువైన సమయం, ధనం, శక్తిని ఎందుకు వృథా చేయాలి? ఆ సమయాన్ని మీ భవిష్యత్తు కోసం, మీ ఎదుగుదల కోసం వెచ్చించండి" అని అల్లు అర్జున్ సూచించారు. ప్రతి మనిషి తన వద్ద ఉన్న శక్తిని దేని కోసం వినియోగిస్తున్నారనేదే అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల నుంచి 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్'కు చెందిన సుమారు వెయ్యి మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో దాదాపు 6 గంటల పాటు సమయం గడిపిన అల్లు అర్జున్, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా హాజరైన అభిమానులందరికీ బీమా కవరేజీని కల్పించి ఆయన తన ఉదారతను చాటుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ట్రోల్స్‌పై స్పందించి సమయం వృథా చేయొద్దు: ఫ్యాన్ వార్స్‌పై స్పందించిన అల్లు అర్జున్..
