టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె... నిన్న తెల్లవారుజామున కన్నుమూశారు.

 

నేడు వనస్థలిపురంలోని 'రెడీ టూ సర్వ్' ఆశ్రమం నుంచి ఆమె పార్థివ దేహాన్ని ఫిలింనగర్‌ మహాప్రస్థానానికి తరలించనున్నారు. సినీ ప్రముఖులు, తోటి నటీనటులు, అభిమానుల చివరి చూపు కోసం ఒక గంట పాటు అక్కడే ఉంచనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నాయకులతో పాటు పలువురు సినీ నటులు హాజరై ఆమెకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ అంత్యక్రియల ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

 

1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన పావలా శ్యామల, సుమారు 100కు పైగా చిత్రాల్లో తనదైన హాస్యంతో, వైవిధ్యమైన నటనతో అలరించారు. చివరిగా 2019లో వచ్చిన 'మత్తు వదలరా' సినిమాలో కనిపించిన ఆమె, గడచిన కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో తన కుమార్తెతో కలిసి దీనస్థితిలో కాలం వెళ్లదీశారు. ఆమె మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.