భారత జట్టు మాజీ సహాయ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డెస్కాటే మరోసారి నైట్‌రైడర్స్‌తో చేరాడు. నైట్‌రైడర్స్‌ స్పోర్ట్స్‌ సంస్థ అతణ్ని హెడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ స్ట్రాటజీగా నియమించింది. ఈ కొత్త బాధ్యతల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల ఎంపిక, జట్టు ప్రణాళిక, ప్రతిభావంతుల గుర్తింపు, ఆటగాళ్ల అభివృద్ధి వంటి కీలక అంశాలను ఆయన పర్యవేక్షించనున్నాడు.

ఈ పదవిలో టెన్‌ డెస్కాటే స్కౌటింగ్‌, ఆటగాళ్ల నియామకం, జట్టు నిర్మాణం, ఆటగాళ్ల ప్రదర్శన విశ్లేషణ వంటి విభాగాలకు వ్యూహాత్మక దిశానిర్దేశం చేయనున్నాడు. అన్ని నైట్‌రైడర్స్‌ జట్లలో ఒకే తరహా క్రికెట్‌ తత్వాన్ని అమలు చేసేలా కోచింగ్‌ బృందాలతో కలిసి పని చేయనున్నాడు. దీంతో పాటు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌, యూఏఈ ఐఎల్‌టీ20లో అబుదాబి నైట్‌రైడర్స్‌, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌కు సహాయ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు.

కొత్త బాధ్యతలపై టెన్‌ డెస్కాటే ఆనందం వ్యక్తం చేశారు. నైట్‌రైడర్స్‌లో మళ్లీ చేరడం సంతోషంగా ఉందన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీల కోచింగ్‌, అనలిటిక్స్‌ బృందాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం ప్రత్యేకమని చెప్పాడు. ప్రతిభావంతుల అన్వేషణ, ఆటగాళ్ల అభివృద్ధి వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు దీర్ఘకాలిక క్రికెట్‌ వ్యూహాన్ని రూపొందించడమే తన లక్ష్యమని వెల్లడించాడు.

టెన్‌ డెస్కాటేకు నైట్‌రైడర్స్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2011లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆటగాడిగా చేరిన అతడు 2012, 2014 ఐపీఎల్‌ టైటిల్‌ విజేత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2022లో కోచింగ్‌ విభాగంలో చేరి, 2024లో కేకేఆర్‌ మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచినప్పుడు సహాయక సిబ్బందిలో భాగమయ్యాడు. నైట్‌రైడర్స్‌ స్పోర్ట్స్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ.. సంస్థ సిద్ధాంతాలపై టెన్‌ డెస్కాటేకు ఉన్న అవగాహన, అంతర్జాతీయ అనుభవం ఈ బాధ్యతలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపాడు.

నెదర్లాండ్స్‌ మాజీ స్టార్‌ బ్యాటర్‌ అయిన టెన్‌ డెస్కాటే, 2024 టీ20 ప్రపంచకప్‌ విజయానంతరం గౌతమ్‌ గంభీర్‌ భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ జట్టు సహాయ కోచ్‌గా నియమితులయ్యాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆయన హయాంలో భారత్‌ 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2025 టీ20 కప్‌, 2026 టీ20 ప్రపంచకప్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. అయితే టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై వరుస సిరీస్‌ పరాజయాలు ఎదురయ్యాయి.

జూన్‌తో ఆయన ఒప్పందం ముగిసినా, ఇంగ్లండ్‌తో జరిగిన వైట్‌బాల్‌ సిరీస్‌ వరకు కొనసాగాడు. అనంతరం భారత జట్టు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టుతో సుదీర్ఘ విదేశీ పర్యటనలు చేయాల్సి రావడం, లండన్‌లో ఉన్న తన చిన్న కుటుంబానికి దూరంగా ఎక్కువ కాలం ఉండాల్సి రావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సమాచారం.