ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), భవిష్యత్తు రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో సంచలన విశ్లేషణ చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ దెబ్బకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అవసరమే లేకుండా పోతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వాలను ఏఐ అంతం చేస్తుందని అన్నారు.
ప్రస్తుత పాలనా వ్యవస్థ అంతా నిజాయతీ, నిర్భయం అనే మానవ బలహీనతలపైనే ఆధారపడి నడుస్తోందని ఆర్జీవీ పేర్కొన్నారు. బదిలీల భయం, పిల్లల చదువులు, లంచాలు, నేతల ఒత్తిళ్లతో అధికారులు లొంగిపోతుంటారని... అదే ఒక అధికారి స్థానంలో ‘ఏఐ’ ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఏఐకి బదిలీ భయం ఉండదు, దురాశ ఉండదు, అర్ధరాత్రి ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చే మంత్రుల బంధువులకు లొంగదని వర్మ స్పష్టం చేశారు. దుబాయ్‌లో ఇప్పటికే మనుషుల ప్రమేయం లేకుండా పనిచేస్తున్న ‘స్మార్ట్ పోలీస్ స్టేషన్ల’ను ఇందుకు ఉదాహరణగా చూపారు.
నాయకులు సెలెక్టివ్ డేటాతో డ్రామాలు ఆడుతుంటే.. ఏఐ మాత్రం శాటిలైట్ సమాచారం, వాతావరణం, మార్కెట్ ధరలను క్షణాల్లో విశ్లేషించి కచ్చితమైన పరిష్కారాన్ని కళ్లముందు ఉంచుతుందన్నారు. ప్రజాప్రతినిధులు మధ్యవర్తులుగా పనిచేసే వ్యవస్థను ఏఐ పారదర్శకంగా మార్చేస్తే, నాయకుల స్వార్థ రాజకీయాలు సాగవని వ్యాఖ్యానించారు. ఆర్థిక అభివృద్ధి, రక్షణ బడ్జెట్ వంటివి మానవ నైతిక నిర్ణయాలని కొందరు వాదించవచ్చు కానీ.. ఇప్పటివరకు నేతలు ఎంతవరకు మానవత్వంతో ఆలోచించారని వర్మ ప్రశ్నించారు. ఏఐ చూడటానికి మనిషి కాకపోయినా, స్వార్థపరులైన మనుషుల కంటే ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆర్జీవీ తేల్చి చెప్పారు.
