ఎల్‌నినో ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు నీళ్లు ఇస్తారనే ధీమాతోనే ఆంధ్రప్రదేశ్ రైతులు పంటలు సాగు చేస్తున్నారని బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డిలతో కలసి ఈరోజు జూరాల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆత్మకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జూరాల ప్రాజెక్టు నుంచి స్థానిక కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయకుండా తెలంగాణ రైతులను గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. "రేవంత్ రెడ్డి ఎట్లయినా సరే ఆంధ్రకు నీళ్లు తరలిస్తారన్న ముందస్తు నమ్మకంతోనే అక్కడి రైతులు ధైర్యంగా విత్తనాలు వేసుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ఏపీ ప్రజలపై ఉన్న ప్రేమ, ఇక్కడి తెలంగాణ రైతాంగంపై లేదనడానికి జూరాల కాలువల నిర్లక్ష్యమే నిదర్శనమని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు.
