ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభం కానుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ విమానాశ్రయం ఒక మణిహారం లాంటిదని, దీని రాకతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెట్టుబడులు వస్తాయని పల్లా హర్షం వ్యక్తం చేశారు. 

 

గతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కోర్టులలో కేసులు వేసిన వారే... ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఇది తమ ఘనత అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. "గతంలో 'ఎర్ర బస్సు సరిగ్గా రాని చోట ఎయిర్‌పోర్ట్ ఎందుకు?' అని ప్రశ్నించిన జగన్, ఇప్పుడు తానే నిర్మించినట్లు భ్రమల్లో బతుకుతున్నారు" అని విమర్శించారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు నిదర్శనమే ఈ విమానాశ్రయమని... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి రికార్డు సమయంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిందని తెలిపారు. టీడీపీ హయాంలోనే శంకుస్థాపన జరిగి, ఇప్పుడు తమ హయాంలోనే ప్రారంభమవుతోందని చెబుతూ... అసలు ఐదేళ్ల పాలనలో వైసీపీ ఈ ప్రాజెక్టు కోసం ఏం చేసిందో సమాధానం చెప్పాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.