డబ్బుంటే ఆశలు నెరవేర్చుకోవచ్చు .. కలలు నిజం చేసుకోవచ్చు .. కోరుకున్నట్లుగా బ్రతకొచ్చు. అయితే డబ్బుంటే కోరుకున్న సర్టిఫికెట్ ను సంపాదించుకోవచ్చు .. మనసు పడిన జాబ్ ను పొందవచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అదెలా సాధ్యమనేది చాటిచెబుతున్న సిరీస్ 'ఎగ్జామ్'. 

సర్కుణం దర్శకత్వం వహించిన ఈ సిరీస్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దుషారా విజయన్ - అదితి బాలన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాసులుంటే చాలు కష్టపడి చదవాల్సిన పనిలేదు. కష్టపడిన వాళ్లందరినీ దాటుకుంటూ వెళ్లి, వాళ్ల కళ్లముందరే కోరుకున్న సీట్లో కూర్చోవచ్చు. పుస్తకాలలో ఏముందో తెలుసుకోవడం కాదు, ఇక్కడ జరుగుతున్న దందాపై కూడా ఒక లుక్కేయమని చెప్పే సిరీస్ ఇది. 

అవకాశం లేదనీ .. అదృష్టం కలిసి రాలేదని కొంతమంది స్టూడెంట్స్ పక్కదారి పడుతుంటారు. అవకాశం లేకపోయినా .. అదృష్టం దరిదాపులలో కనిపించకపోయినా మరికొంతమంది అనుకున్నది సాధిస్తారు. అలాంటి రెండు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. బలమైన కథాకథనాలతో .. బలమైన పాత్రలతో నడిచే ఈ సిరీస్, ప్రతి ఒక్కరూ చూసితీరవలసిన సిరీస్ అని చెప్పచ్చు.