మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది.

జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ ఏఎస్‌ చంద్రుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. నామినేషన్‌ తిరస్కరణపై అసంతృప్తి ఉంటే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడమే సాధారణంగా అందుబాటులో ఉన్న మార్గమని కోర్టు వ్యాఖ్యానించింది. రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం తప్పుగా ఉన్నప్పటికీ ఆ దశలో కోర్టు జోక్యం చేసుకోవడం సాధారణం కాదని పేర్కొంది. దీంతో నటరాజన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ చేసిన వాదనలను కోర్టు అంగీకరించలేదు.

మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను, తెలంగాణలో నమోదైన ఓ కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో కేవలం నోటీసులు మాత్రమే జారీ అయ్యాయని, దర్యాప్తు లేదా ఛార్జిషీట్‌ దశకు వెళ్లలేదని కాంగ్రెస్‌ వాదిస్తోంది. అలాంటి పరిస్థితిని పూర్తి స్థాయి క్రిమినల్‌ కేసుగా పరిగణించి నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదని సింఘ్వీ కోర్టుకు వివరించారు.