ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది జలాలు అందకుండా చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ శాఖ నిర్వహించిన 'మేధావుల సదస్సు'లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్య భాష అర్థం చేసుకోని వారికి ఎలా బదులివ్వాలో 'ఆపరేషన్ సిందూర్' ద్వారా తమ ప్రభుత్వం ప్రపంచానికి చాటిచెప్పిందని ఆయన అన్నారు.

పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రస్తావిస్తూ.. "ఉగ్రవాదుల దుశ్చర్యల పట్ల కన్నీళ్లు రానివారు, మా నుంచి నీళ్లు ఆశించవద్దు. మానవత్వ శత్రువులకు, ఉగ్రవాద సానుభూతిపరులకు సింధు నది జలాలను చేరనివ్వబోం" అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు' అనే వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. 

గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ తన సార్వభౌమ హక్కులను ఉపయోగించుకుని సింధు జలాల ఒప్పందాన్ని (ఐడ‌బ్ల్యూటీ) తాత్కాలికంగా నిలిపివేసిందని ఆయన తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతును శాశ్వతంగా విరమించుకునే వరకు ఈ ఒప్పందంపై తమ వైఖరి మారదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఒప్పందాలు కొనసాగవని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సింధు నదీ జలాల వినియోగంపై 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ, రాజ్‌నాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. "ఒకప్పుడు ఆర్టికల్ 370ని ఎవరూ రద్దు చేయలేరని కాంగ్రెస్ చెప్పేది. కానీ, మా ప్రభుత్వం ఎంత సులభంగా దాన్ని రద్దు చేసిందో దేశ ప్రజలు చూశారు" అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు దేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం, జీఎస్టీ అమలు, దేశవ్యాప్త విద్యుదీకరణ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు వంటివి తమ ప్రభుత్వ ఘనతలని పేర్కొన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ స్వరూపం మారిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న కశ్మీర్‌లో ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని, దశాబ్దాల తర్వాత తొలిసారిగా కృష్ణాష్టమి వేడుకలు, ముహర్రం ఊరేగింపులు శాంతియుతంగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే, ఏళ్ల తరబడి మూతపడిన సినిమా హాళ్లు ఇప్పుడు తిరిగి తెరుచుకుంటున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.