ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి   జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై అన్ని అర్హతలు సాధించినప్పటికీ అనేక మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని జగన్ అన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి కొందరికి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. దీని వల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీ ఆరోపణలు, ఎంపికల్లో అవకతవకలు, మెరిట్ జాబితాలో మార్పులు వంటి అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే, డీఎస్సీ బాధితుల తరఫున వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుందని, ఇందుకోసం ప్రత్యేక లీగల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ కమిషన్‌ను నియమించి నిజానిజాలను వెలికితీస్తామని హామీ ఇచ్చారు. అన్యాయానికి గురైన అర్హులైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు కల్పించి న్యాయం చేస్తామని జగన్ స్పష్టం చేశారు.