డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత యూపీఐ చాలా మందికి రోజువారీ జీవితంలో భాగమైంది. డబ్బు పంపాలన్నా, బిల్లు చెల్లించాలన్నా యూపీఐనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతా మార్చిన తర్వాత చాలామంది ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అదే పాత బ్యాంక్ ఖాతాను యూపీఐ యాప్‌లో అలాగే ఉంచడం.

కొత్త అకౌంట్‌ జోడిస్తే
యూపీఐలో ఒకే మొబైల్ నంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త బ్యాంక్ ఖాతా జోడిస్తే పాతది ఆటోమేటిక్‌గా తొలగిపోదు. అది కూడా యాప్‌లో కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అవసరం లేని అకౌంట్లను స్వయంగా తొలగించాలి. వాడని బ్యాంక్ ఖాతా యూపీఐలో ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ఖాతా ఇక యాక్టివ్‌లో లేకపోతే లావాదేవీలు విఫలమవుతాయి. రిఫండ్‌లు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఆటో డెబిట్‌ చెల్లింపులు కూడా ప్రభావితమవుతాయి.

గందరగోళం
ఒకే యాప్‌లో చాలా బ్యాంక్ ఖాతాలు కనిపిస్తే ఏ ఖాతా ప్రస్తుతం ఉపయోగంలో ఉందో గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా వృద్ధులు లేదా డిజిటల్ చెల్లింపులకు కొత్తగా అలవాటు పడుతున్న వారికి ఇది గందరగోళం కలిగించవచ్చు. అందుకే ప్రస్తుతం వాడుతున్న ఖాతాలను మాత్రమే ఉంచడం మంచిది.

పాత ఖాతాను ఎలా తొలగించాలి?
యూపీఐ యాప్‌లో ప్రొఫైల్‌ లేదా బ్యాంక్ అకౌంట్స్‌ విభాగానికి వెళ్లాలి. అక్కడ లింక్ అయిన అన్ని బ్యాంక్ ఖాతాలు కనిపిస్తాయి. తొలగించాలనుకున్న అకౌంట్‌ను ఎంచుకుని ‘రిమూవ్’ లేదా ‘అన్‌లింక్’ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. దీంతో ఆ ఖాతా యూపీఐ నుంచి తొలగిపోతుంది. భవిష్యత్తులో అవసరం వస్తే దాన్ని మళ్లీ యాప్‌లో జోడించవచ్చు.

ఈ విషయాలు గుర్తుంచుకోండి
బ్యాంక్ ఖాతా మార్చిన తర్వాత యాక్టివ్‌ ఆటోపేలు, ఈఎంఐలు, సబ్‌స్క్రిప్షన్లు ఏ ఖాతాకు లింక్ అయ్యాయో ఒకసారి చెక్ చేయాలి. అలాగే కొంతకాలానికోసారి యూపీఐలో ఉన్న బ్యాంక్ ఖాతాల జాబితాను పరిశీలించడం మంచిది. అవసరం లేని ఖాతాలను తొలగిస్తే యాప్ వినియోగం సులభంగా ఉంటుంది. పొరపాట్లకు అవకాశాలు తగ్గుతాయి.