భారత సైన్యానికి కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్ 30న కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ధీరజ్ సేథ్ భారత సైన్యానికి తదుపరి అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సేథ్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందారు. 1986 డిసెంబర్‌లో ఆర్మర్డ్ కార్ప్స్‌లో అధికారిగా సైన్యంలో చేరారు. దాదాపు 40 ఏళ్లకు పైగా సాగిన సైనిక జీవితంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఎడారి ప్రాంతాల్లో ఆర్మర్డ్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించిన ధీరజ్ సేథ్, పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఆర్మ్‌డ్‌ బ్రిగేడ్‌కు కమాండర్‌గా పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించే దళాలకు కూడా నాయకత్వం అందించారు. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో భారత సైన్యంలో అత్యంత కీలకమైన స్ట్రైక్ ఫార్మేషన్లలో ఒకటైన సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. ఢిల్లీ ప్రాంత జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్‌గా కూడా పనిచేశారు. ఈ సమయంలో దేశీయ, అంతర్జాతీయ సైనిక కార్యక్రమాల సమన్వయం బాధ్యతలు నిర్వర్తించారు.

సైన్యాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ధీరజ్ సేథ్ కీలక పాత్ర పోషించారు. సైనిక సామర్థ్యాల పెంపు, భవిష్యత్ వ్యూహాల రూపకల్పన, దళాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల్లో ఆయన సేవలు విశేష గుర్తింపు పొందాయి. ధీరజ్ సేథ్ హయ్యర్ కమాండ్ కోర్స్‌, నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో ఉన్నత శిక్షణ పొందారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్‌లో కూడా పాల్గొన్నారు. సమకాలీన సైనిక వ్యూహాలపై ఆయనకు విస్తృత అవగాహన ఉందని అధికారులు చెబుతున్నారు.