భారత సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'. ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన తొలి భాగం ట్రైలర్‌ను ఈరోజు తెల్లవారుజామున చిత్రబృందం విడుదల చేసింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్, విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. అద్భుతమైన విజువల్స్, భారీ తారాగణం, ఆకట్టుకునే నేపథ్య సంగీతంతో ట్రైలర్ అంచనాలను మించి ఉందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
4.09 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముల్లోకాలకు అధిపతిని తానేనంటూ గర్వంగా ప్రకటించుకునే రావణుడి (యశ్) సంభాషణతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. లోకంలో అధర్మం పెరిగిపోతున్నప్పుడు, విష్ణువు రాముడి అవతారంలో భూమిపైకి వస్తాడు. రాముడి (రణ్‌బీర్) బాల్యం, రాక్షసులతో పోరాటాలు, సీతతో వివాహం వంటి ఘట్టాలను చూపించారు. ఆ తర్వాత 14 ఏళ్ల వనవాసం, లక్ష్మణుడితో కలిసి సీతారాములు అడవులకు వెళ్లడం, రావణుడు సీతను అపహరించడం వంటి కీలక సన్నివేశాలతో ట్రైలర్ కథపై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి.
ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ఒకప్పటి ‘రామానంద్ సాగర్’ సీరియల్‌లో రాముడిగా మెప్పించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథుడి పాత్రలో కనిపించడం విశేషం. హనుమంతుడిగా సన్నీడియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారాదత్త, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
నిజానికి ఈ ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో, ముంబైలో, శాన్ డియాగో కామిక్-కాన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ ఈవెంట్ల నుంచి కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో ట్రైలర్‌ను విడుదల చేయాలని అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అధికారికంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమితా మల్హోత్రా సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో ‘రామాయణ: పార్ట్-1’ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఎట్టకేలకు విడుదలైన 'రామాయణ పార్ట్-1' ట్రైలర్ రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్..
