ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసులో భార్యే ప్రధాన నిందితురాలిగా తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్ రాజు తరచూ భార్యను ప్రశ్నిస్తూ వేధించడంతో, అతడిని అడ్డు తొలగించాలనే కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రియుడితో కలిసి భర్త హత్యకు రూ.12 లక్షల సుపారీ ఇచ్చిన దుర్గామణి, పక్కా ప్రణాళికతో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును గొంతు నులిమి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేసినట్లు గుర్తించారు.

కేసుపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికల ఆధారంగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి కారు, సెల్‌ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ స్వాధీనం చేసుకున్నారు.

భార్యే ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన ఘటన ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.