సముద్రపు ఒడ్డున కనిపించే ఆల్చిప్పలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల ఆయీషా ఆసిఫ్ మాత్రం వాటిలో ఓ అద్భుతాన్ని చూసింది. సముద్రపు అలలు ఎంత బలంగా కొట్టినా బండరాళ్లకు గట్టిగా అతుక్కుని ఉండే ఆల్చిప్పల సామర్థ్యం నుంచి స్ఫూర్తి పొందింది. ఆ స్ఫూర్తితో పర్యావరణానికి హాని చేయని ఒక ప్రత్యేకమైన జిగురును తయారు చేసే ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ వినూత్న ఆలోచనతో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక '3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్' ఫైనల్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆలోచనకు కారణమేంటి?
మనం ఇళ్లలో, పరిశ్రమల్లో వాడే చాలా జిగురులలో వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి గాలిలో కలిసి కాలుష్యానికి కారణమవుతాయి, ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. దీనికి ప్రత్యామ్నాయం కోసం ఆయీషా ప్రకృతి వైపు చూసింది. ఆల్చిప్పలు తమ శరీరంలో ఉత్పత్తి చేసుకునే సహజమైన, శక్తిమంతమైన జిగురుపై దృష్టి పెట్టింది. సహజ ప్రోటీన్లు, ఐరన్ ఆధారిత పదార్థాలతో అలాంటి జిగురునే తయారు చేయాలన్నది ఆమె ప్రాజెక్ట్ ఉద్దేశం. "మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి స్ఫూర్తి పొంది, నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమంటే నాకు చాలా ఇష్టం" అని ఆయిషా తెలిపింది.

ప్రతిష్ఠాత్మక పోటీలో ఫైనలిస్ట్‌గా..
డిస్కవరీ ఎడ్యుకేషన్, 3M సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీలో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు పాల్గొంటారు. ఈ ఏడాది ఫైనల్‌కు చేరిన 10 మందిలో ఆయిషా ఒకరిగా నిలిచింది. విజేతకు "అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్" కిరీటంతో పాటు 25,000 డాలర్ల బహుమతి లభిస్తుంది. ఈ పోటీలో భాగంగా ఫైనలిస్టులకు 3M కంపెనీకి చెందిన సీనియర్ సైంటిస్టులు మెంటార్‌లుగా వ్యవహరిస్తారు. ఆయీషాకు డాక్టర్ రోహిత్ గుప్తా మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఆయన పర్యవేక్షణలో ఆయీషా తన ప్రాజెక్టును మరింత మెరుగుపరుచుకుని, అక్టోబర్‌లో జరిగే ఫైనల్స్‌లో ప్రదర్శించనుంది.

భవిష్యత్తులో పర్యావరణ శాస్త్రవేత్త కావాలన్నది తన లక్ష్యమని ఆయీషా చెబుతోంది. తన ఆలోచనలు, ఆవిష్కరణల ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపాలని ఆశిస్తోంది. విజయం సంగతి ఎలా ఉన్నా, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది పర్యావరణ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ చిన్నారి చేస్తున్న ప్రయత్నం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.