కామన్వెల్త్ గేమ్స్ 2026 పారా అథ్లెటిక్స్‌లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పురుషుల 100 మీటర్ల T47 స్ప్రింట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. దిలీప్ మహాదు గవిత్ సరికొత్త గేమ్స్ రికార్డుతో స్వర్ణం గెలవగా, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని సాధించి అద్భుతమైన 1-2 ఫినిష్‌ను అందించాడు.
బుధవారం జరిగిన ఫైనల్ రేసులో దిలీప్ గవిత్ కేవలం 10.71 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి, పాత గేమ్స్ రికార్డును బద్దలుకొట్టాడు. అతడి వెనుకే వచ్చిన మహమ్మద్ బాసిల్ 10.83 సెకన్ల టైమింగ్‌తో తన సీజన్‌లోని ఉత్తమ ప్రదర్శన ఇచ్చి రజతాన్ని అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన కెవిన్ శాంటోస్ (10.85 సెకన్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, షాట్‌పుట్‌లో షర్మిల తర్వాత భారత్‌కు ఇది మూడో స్వర్ణం.
ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 15కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన దిలీప్ గవిత్, చిన్నతనంలో చెట్టుపై నుంచి పడి తన చేయిని కోల్పోయాడు. అయినప్పటికీ పట్టుదలతో పారా అథ్లెటిక్స్‌లో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాడు. 2022 ఏషియన్ పారా గేమ్స్‌లోనూ గవిత్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత పారా అథ్లెట్లు..
