92 ఏళ్ల వయసులో చాలామంది నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇటలీకి చెందిన ఎమ్మా మారియా మజ్జెంగా మాత్రం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మాజీ సైన్స్‌ టీచర్‌ అయిన ఆమె ఇప్పటికీ అథ్లెట్‌గా పోటీల్లో పాల్గొంటూ 90-94 ఏళ్ల వయసు క్యాటగిరీలో పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 

అయితే ఎమ్మా గురించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న విషయం ఆమె విజయాలు కాదు. ఆమె శరీర సామర్థ్యమే. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 92 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఆమె శారీరక సామర్థ్యం దాదాపు 30 ఏళ్ల వయసున్న మహిళ స్థాయిలో ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఎమ్మా శరీరంలో ఆక్సిజన్‌ను గ్రహించి కండరాలకు చేరవేసే వ్యవస్థ అత్యంత సమర్థంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా పనితీరు కూడా యువత స్థాయిలోనే ఉందని వెల్లడించారు. వృద్ధాప్య ప్రభావాన్ని వ్యాయామం ఎంతవరకు తగ్గించగలదన్న దానికి ఎమ్మా ఉదాహరణగా నిలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు. 

ఇంత ఫిట్‌గా ఉండటానికి ఆమె అనుసరించే సింపుల్‌ లైఫ్‌స్టైల్‌ కూడా ఓ కారణం. ఎమ్మా వారానికి మూడు రోజులు మాత్రమే వ్యాయామం చేస్తుంది. ఒక్కో సెషన్‌ గంటలోపే ముగుస్తుంది. కొద్దిసేపు జాగింగ్‌, కొన్ని స్ప్రింట్లు, రోజువారీ నడక, తేలికపాటి వ్యాయామాలు ఆమె రొటీన్‌లో భాగం. ఎక్కువ దూరం పరుగులు తీయడం మాత్రం ఆమెకు అలవాటు లేదు.

ఆహారం విషయంలో కూడా ఎమ్మా ప్రత్యేక డైట్‌లను అనుసరించడం లేదు. చేపలు, గుడ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటుంది. అదే సమయంలో అప్పుడప్పుడు స్టేక్‌ వంటి ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తుంది. కఠినమైన ఆహార నియమాల కంటే బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, క్రమం తప్పని వ్యాయామమే ఆరోగ్య రహస్యం అని ఆమె జీవనశైలి చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించే ఆరోగ్యకర జీవన విధానానికి కూడా ఎమ్మా అలవాట్లు దగ్గరగా ఉండటం గమనార్హం. వయసు పెరిగినా శారీరక చురుకుదనం కొనసాగిస్తే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చని ఆమె మరోసారి నిరూపించింది.