మధుమేహం అనగానే చాలా మంది ముందుగా చక్కెరకు దూరంగా ఉండాలని భావిస్తారు. తీపి పదార్థాలు తగ్గిస్తే ప్రమాదం తగ్గుతుందని అనుకుంటారు. కానీ తాజా అధ్యయనం మరో విషయాన్ని గుర్తు చేస్తోంది. సమస్య కేవలం ఏం తింటున్నామన్న దాంట్లోనే కాదు.. ఏం తినడం లేదన్న దాంట్లోనూ ఉందని చెబుతోంది. ముఖ్యంగా భారత్‌లాంటి దేశాల్లో పండ్లను తగినంతగా తీసుకోకపోవడం టైప్‌-2 డయాబెటిస్‌ భారాన్ని మరింత పెంచుతోందని పరిశోధకులు వెల్లడించారు.

పండ్ల కొరతే పెద్ద ప్రమాదం
గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ స్టడీ-2023 విశ్లేషణలో భారత్‌తో పాటు దక్షిణాసియాలో టైప్‌-2 మధుమేహానికి ప్రధాన ఆహార సంబంధిత ప్రమాద కారకం పండ్లను తక్కువగా తీసుకోవడమేనని తేలింది. చక్కెర, ప్రాసెస్డ్‌ ఆహారం గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ అధ్యయనం దృష్టిని మరో కీలక అంశంపైకి మళ్లించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెంచడం కూడా మధుమేహ నియంత్రణలో అంతే ముఖ్యమని స్పష్టం చేసింది.

ఆసియా అంతటా భారీ ప్రభావం
1990 నుంచి 2023 వరకు ఆసియాలోని 34 దేశాల సమాచారాన్ని పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించారు. 2023 ఒక్క ఏడాదిలోనే ఆహార అలవాట్ల కారణంగా టైప్‌-2 మధుమేహానికి సంబంధించి 99.7 లక్షల డీఏఎల్‌వైలు నమోదైనట్లు వెల్లడైంది. అలాగే 2,14,810 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఆహార అలవాట్లు మధుమేహంపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

లక్షల మందిపై ప్రభావం
పండ్లను తగినంతగా తినకపోవడం ఒక్కటే 36 లక్షల డీఏఎల్‌వైలు, 85,960 మరణాలకు కారణమైనట్లు అధ్యయనం వెల్లడించింది. పండ్లలో ఉండే పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీర జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. ఇవి ఇన్సులిన్‌ స్పందనను మెరుగుపరచడంతో పాటు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని వివరించింది.

అంతటా సమస్య ఒకలా లేదు
ఆసియాలోని అన్ని దేశాల్లో ఒకే రకమైన ప్రమాదాలు లేవని అధ్యయనం స్పష్టం చేసింది. ఆగ్నేయాసియాలో తృణధాన్యాలు తక్కువగా తీసుకోవడం ప్రధాన సమస్యగా ఉండగా, తూర్పు ఆసియాలో మాంసం అధికంగా తినడం ఎక్కువ ప్రభావం చూపుతోంది. అధిక ఆదాయ ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో ప్రాసెస్డ్‌ మాంసం ప్రధాన ప్రమాద కారకంగా గుర్తించారు. భారత్‌తో పాటు దక్షిణాసియాలో మాత్రం పండ్ల వినియోగం పెంచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.

భారత్‌కు స్పష్టమైన సందేశం
ప్రపంచంలో మధుమేహంతో జీవిస్తున్న వారిలో 60 శాతానికి పైగా ఆసియాలోనే ఉన్నారని అధ్యయనం పేర్కొంది. భారత్‌లోనే దాదాపు 7.7 కోట్ల మంది టైప్‌-2 మధుమేహంతో బాధపడుతుండగా, మరో 2.5 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్‌ దశలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో మధుమేహాన్ని అరికట్టాలంటే చక్కెర తగ్గించడమే కాకుండా రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు.