చాలామందికి పర్స్‌ను ప్యాంటు వెనుక జేబులో పెట్టుకోవడం అలవాటు. అది కూడా గంటల తరబడి అలాగే కూర్చోవడం రోజువారీ జీవితంలో భాగమే. కానీ ఈ చిన్న అలవాటు నడుము నొప్పి, పిరుదుల్లో నొప్పి, కాళ్లలో తిమ్మిరి వంటి సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో ఇది వెన్నెముక సమస్యలా కనిపించినా.. అసలు కారణం పర్స్‌ కావొచ్చని చెబుతున్నారు.

మన శరీరంలోనే అతిపెద్ద నరం ‘సయాటిక్‌ నర్వ్‌’. ఇది నడుము నుంచి పిరుదుల మీదుగా కాళ్ల వరకు వెళ్తుంది. మందంగా ఉన్న పర్స్‌ను వెనుక జేబులో పెట్టుకుని ఎక్కువసేపు కూర్చుంటే ఆ నరంపై ఒత్తిడి పడుతుంది. దీనినే వైద్యులు ‘వాలెట్‌ సయాటికా’ లేదా ‘ఫ్యాట్‌ వాలెట్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ ఒత్తిడి వల్ల నరం చికాకు చెందడం, వాపు రావడం జరుగుతుంది. ఫలితంగా వెన్నునొప్పి, పిరుదులో మంట, కాళ్లలో నొప్పి, తిమ్మిరి, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పర్స్‌ పెట్టుకునే వైపే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చునే ఉద్యోగులు, డ్రైవర్లు, తరచూ ప్రయాణించే వారు ఈ సమస్యకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. మందంగా ఉన్న పర్స్‌లో అవసరం లేని కార్డులు, బిల్లులు, నగదు పెట్టుకోవడం ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఈ సమస్యకు చాలా సందర్భాల్లో మందులు అవసరం ఉండవు. 

పర్స్‌ను వెనుక జేబులో కాకుండా ముందు జేబులో లేదా బ్యాగ్‌లో పెట్టుకోవడం, పర్స్‌ను సన్నగా ఉంచడం, ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం, సరైన భంగిమలో కూర్చోవడం వంటి అలవాట్లు నొప్పిని తగ్గిస్తాయి. అయినా నొప్పి తగ్గకపోవడం, కాళ్లలో బలహీనత, నడవడంలో ఇబ్బంది లేదా మూత్ర, మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.