రాగి పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన చిరుధాన్యాల్లో ఒకటి. ఇందులో కాల్షియం, ఐరన్‌, ఫైబర్‌, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు, రక్తహీనత తగ్గించేందుకు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారూ రాగిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటున్నారు.

అయితే రోజూ రాగినే ప్రధాన ఆహారంగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. గోధుమలు, బియ్యం, ఇతర చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. రాగిలో కూడా కార్బోహైడ్రేట్లు ఉండటంతో పరిమిత మోతాదులోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాగిలో ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో కొందరికి జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే ఇందులో సహజసిద్ధంగా ఆక్సలేట్లు ఉంటాయి. అందువల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఎక్కువ మోతాదులో తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాగి తినేటప్పుడు తగినంత నీరు తాగడం కూడా అవసరమని సూచిస్తున్నారు.

రాగిని రోజూ ఒకే రూపంలో కాకుండా రాగి సంగటి, రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి రొట్టె, రాగి జావ, రాగి చీలా.. ఇలా రకరకాలుగా తీసుకుంటే ఆహారంలో వైవిధ్యం ఉంటుంది. మొత్తంగా రాగి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే అయినప్పటికీ, దానిపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర ధాన్యాలతో కలిసి సమతులంగా తీసుకోవడమే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.