హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శ్రీనివాసులు రెడ్డిపై ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడి, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపిస్తూ ఆమె నేరుగా డీజీపీ సీవీ ఆనంద్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే ఉన్నతాధికారులు స్పందించి, శ్రీనివాసులు రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ బదిలీ చేశారు.

శ్రీనివాసులు రెడ్డి గతంలో అమీన్‌పూర్ సీఐగా ఉన్నప్పుడు కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని, అప్పుడాయన తనపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ దారుణాన్ని వీడియో తీశారని బాధితురాలు ఆరోపించారు. ఆ తర్వాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, అంతేకాకుండా తన నుంచి సుమారు రూ. 2 కోట్లు వసూలు చేశారని డీజీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా జతచేశారు. తాను గర్భం దాల్చితే బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించారని ఆమె ఆరోపించారు. సీఐ దాష్టీకంపై హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించానని, అయితే అక్కడి అధికారులు సీపీని కలవకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు.  

బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే స్పందించారు. ఈ కేసు విచారణ బాధ్యతను మల్టీజోన్ ఐజీ షానవాజ్ ఖాసీంకు అప్పగించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేయాలని వెస్ట్ జోన్ డీసీపీని ఆదేశించినట్టు తెలిసింది. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే సీపీ సజ్జనార్ ఏడుగురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీనివాసులు రెడ్డిని జూబ్లీహిల్స్ నుంచి వీఆర్‌కు పంపించి, ఆయన స్థానంలో రాజేంద్రనగర్ సీఐ ముత్తు యాదవ్‌ను నియమించారు.