దేశంలో వరుసగా వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీల సమస్యకు చెక్ పెట్టేందుకు జేఈఈ (JEE) నిర్వహణ విధానాలే ఆదర్శమని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి అభిప్రాయపడ్డారు. నీట్ (NEET) లీకేజీ వివాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరుగురి సభ్యుల ఉన్నతస్థాయి సంస్కరణల కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పరీక్షల వ్యవస్థలోని లోపాలు, పరిష్కారాలపై పలు కీలక విషయాలను పంచుకున్నారు.


జేఈఈ పరీక్షల ప్రయాణాన్ని గుర్తుచేస్తూ... "నేను 1985లో జేఈఈ రాసినప్పుడు కేవలం 5,000 మంది మాత్రమే పోటీపడేవారు. కానీ నేడు ఆ సంఖ్య 15 లక్షలకు చేరింది. కాగితం-పెన్నుల నుంచి ఓఎంఆర్ షీట్లు, కంప్యూటర్ ఆధారిత పరీక్షల వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడుకోవడం వల్లనే జేఈఈ పారదర్శకంగా, ఒక్క లీక్ కూడా లేకుండా సాగుతోంది. బయోమెట్రిక్ తనిఖీలు, మెటల్ డిటెక్టర్లతో ఎలక్ట్రానిక్ పరికరాలను అడ్డుకుంటూ పరీక్షల పవిత్రతను కాపాడుతున్నాం" అని కామకోటి వివరించారు.


ఇక ఇటీవలి నీట్-2026 పేపర్ లీకేజీపై స్పందిస్తూ... రాధాకృష్ణన్ కమిటీ చేసిన 250కి పైగా రికమండేషన్లలో చాలా వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పాటించిందని ఆయన గుర్తుచేశారు. అందుకే మే 3న ప్రింటింగ్, ట్రంక్ పెట్టెల రవాణా నుంచి మే 20న విద్యార్థుల చేతికి పేపర్ అందే వరకు ఎక్కడా లీకేజీ జరగలేదని తెలిపారు.


అయితే సీబీఐ దర్యాప్తు వెల్లడించినట్లుగా... పేపర్ ఎన్టీఏ (NTA) ప్రధాన కార్యాలయం నుంచి బయటకు రాకముందే లీక్ అయిందని, ఇక్కడే ప్రధాన విశ్వసనీయత దెబ్బతిందని విశ్లేషించారు. ఎన్ని సాంకేతిక భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ, వ్యవస్థలోని ప్రాథమిక విశ్వసనీయత దెబ్బతినడం వల్లే ఈ అక్రమం చోటుచేసుకుందని కామకోటి స్పష్టం చేశారు.