జిల్లా టాపర్‌ కన్నా ఒక్క మార్కు తక్కువ వచ్చిందన్న కారణంతో లెక్చరర్ అవమానించి, చెంపదెబ్బ కొట్టడంతో ఓ ఇంటర్ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు విద్యార్థి రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్, ఉపాధ్యాయుల ప్రవర్తనపై తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది.

గద్వాల రూరల్ కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440కి 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో అత్యుత్తమ విద్యార్థిగా నిలిచాడు. అయితే, శనివారం కాలేజీలో ఓ మహిళా లెక్చరర్, జిల్లా టాపర్‌కు వచ్చిన 435 మార్కులతో తరుణ్ మార్కులను పోల్చి అతడిని తక్కువ చేసి మాట్లాడారు.

దీనిపై తరుణ్ "ఇలా పోల్చి అవమానించడం తప్పు మేడం" అని అనడంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో "నీవేమైనా మంత్రి కొడుకువా?" అంటూ అందరి ముందు చెంపపై కొట్టారు. తోటి విద్యార్థులు నవ్వడంతో తరుణ్ తీవ్ర అవమానంగా భావించాడు. ఈ విషయం ప్రిన్సిపల్ వీరన్న దృష్టికి వెళ్లడంతో, సోమవారం తరుణ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

కానీ, తీవ్ర మనస్తాపానికి లోనైన తరుణ్ మంగళవారం కాలేజీకి వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పొలం పనుల నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు బుచ్చన్న, రేణమ్మ కుమారుడిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరయ్యారు.

సూసైడ్ నోట్‌లో విద్యార్థి ఆవేదన
ఆత్మహత్యకు ముందు తరుణ్ రాసిన లేఖలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. "ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి కానీ, నిరుత్సాహపరచకూడదు. ఆమె మాటల వల్ల నేను తీవ్రంగా కుంగిపోయాను. ఒక సున్నితమైన విద్యార్థి మనసు ఎంతలా గాయపడుతుందో ఆమెకు తెలియాలి. నా చావుతోనైనా ప్రజలకు ఈ విషయం తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాను. దయచేసి ఆ లెక్చరర్‌పై చర్యలు తీసుకోండి" అని పేర్కొన్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.