అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు ఆశలు రేకెత్తించే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలంగా దేశంలో నివసిస్తున్న వారికి గ్రీన్ కార్డ్ పొందేందుకు వీలు కల్పించే ఒక కొత్త బిల్లును అమెరికా సెనేట్‌లో తిరిగి ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే, ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై ఉండి గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకుపోయిన భారతీయ నిపుణులకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది.

కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్ సెనేటర్ అలెక్స్ పడిల్లా, 'రిన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929' పేరుతో ఈ బిల్లును మరోసారి సెనేట్ ముందుకు తెచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 249లో ఉన్న 'రిజిస్ట్రీ' అనే నిబంధనను సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత చట్టం ప్రకారం 1972 జనవరి 1కు ముందు అమెరికాలోకి ప్రవేశించిన వారు మాత్రమే ఈ నిబంధన కింద గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత 50 ఏళ్లుగా ఈ తేదీ మారకపోవడంతో ఈ మార్గం దాదాపు నిరుపయోగంగా మారింది.

తాజా ప్రతిపాదన ప్రకారం ఈ పాత తేదీని తొలగించి, దాని స్థానంలో సరికొత్త నిబంధనను తీసుకువస్తారు. దీని ప్రకారం ఎలాంటి నేరచరిత్ర లేకుండా, చట్టపరమైన ఇతర షరతులను సంతృప్తిపరిచే వలసదారులు, దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం ఏడు సంవత్సరాలుగా నిరంతరాయంగా అమెరికాలో నివసిస్తూ ఉంటే గ్రీన్ కార్డ్‌కు అర్హులవుతారు.

ప్రస్తుత గ్రీన్ కార్డ్ జారీ విధానంలో ఉన్న జాప్యం వల్ల అత్యధికంగా నష్టపోతున్నది భారతీయులే. ప్రతి దేశానికి కేవలం 7 శాతం మాత్రమే ఉపాధి ఆధారిత వీసాలు కేటాయించాలన్న నిబంధన వల్ల, అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్న భారతీయులు దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వస్తోంది. చాలామంది భారతీయ నిపుణులు, వారి కుటుంబాలు తాత్కాలిక వీసాలపైనే ఏళ్ల తరబడి జీవిస్తున్నారు.

ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే, హెచ్-1బీ వీసాదారులు, వారి పిల్లలు, డ్రీమర్స్, టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (టీపీఎస్) లబ్ధిదారులు, అత్యవసర సేవల సిబ్బంది వంటి అనేక వర్గాలకు గ్రీన్ కార్డ్ కోసం ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. ఇది వలసదారులలో అనిశ్చితిని తగ్గించి, ఉద్యోగ భద్రతను పెంచుతుందని, పదేపదే వీసా పొడిగింపులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, అర్హత సాధించినంత మాత్రాన గ్రీన్ కార్డ్ దానంతట అదే రాదని, సవరించిన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు అన్ని అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. చట్టంగా మారాలంటే సెనేట్, ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) రెండింటిలోనూ ఆమోదం పొంది, ఆ తర్వాత అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు సెనేట్ డెమొక్రటిక్ విప్ డిక్ డర్బిన్‌తో పాటు ఇతర సెనేటర్లు, 30కి పైగా సంస్థల మద్దతు ఉంది.