బీహార్‌ను కుదిపేసిన బీపీఎస్‌సీ టీచర్ రిక్రూట్‌మెంట్ (టీఆర్ఈ-3) పేపర్ లీక్ కేసులో ఆర్థిక నేరాల విభాగం (ఈవోయూ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మనీశ్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. పరీక్షకు ముందే 30 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందించి, వారి నుంచి సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈవోయూ అధికారుల కథనం ప్రకారం.. డాక్టర్ మనీశ్ కుమార్ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సీల్డ్ ప్రశ్నాపత్రాల బాక్సులను తెరిచి, తిరిగి మూసివేయడంలో నైపుణ్యం సంపాదించాడు. ప్రతి అభ్యర్థి నుంచి రూ.50,000 కమీషన్‌గా తీసుకున్నాడు. తన సహచరులైన డాక్టర్ శివ్, డాక్టర్ శుభంతో కలిసి ఈ రాకెట్‌ను నడిపినట్లు గుర్తించారు. 2024 మార్చి 15న జరిగిన పరీక్షకు ముందు, పాట్నాలోని ఓ హోటల్‌లో 30 మంది అభ్యర్థులకు బస ఏర్పాటు చేసి, వారికి ముందుగానే ప్రశ్నాపత్రాన్ని అందించాడు.

మార్చి 14న భాబువాలోని కోహినూర్ హోటల్‌పై అధికారులు దాడి చేసినప్పటికీ, మనీశ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే, హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతడిని గుర్తించారు. పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (పీఎం‌సీహెచ్), నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఎన్ఎంసీహెచ్) విద్యార్థుల డేటాను పరిశీలించి అతడి గుర్తింపును ధ్రువీకరించుకున్నారు. మనీశ్.. పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సంజీవ్ ముఖియా కుమారుడని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మందిని అరెస్ట్ చేశారు.

విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఇదిలా ఉండగా, పరీక్షల మోసాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకులు, వ్యవస్థీకృత మోసాల వంటి కేసుల కోసం ప్రత్యేకంగా మూడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024 నిబంధనల కింద పాట్నా, లఖిసరాయ్, పూర్ణియాలో ఈ కోర్టులను నెలకొల్పారు. కేసులను మూడు నెలల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పాట్నాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు... టీఆర్ఈ-3 పేపర్ లీక్, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ స్కామ్, 67వ బీపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్ష కేసు వంటి పలు కీలక కేసులను విచారించనుంది. లఖిసరాయ్ కోర్టు రీ-నీట్ పరీక్ష రిగ్గింగ్ కేసును, పూర్ణియా కోర్టు ఎస్ఎస్ఈ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పరీక్ష అవకతవకలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది.