కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఓ నిపుణుల కమిటీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను సంస్కరించేందుకు వేసిన ఈ కమిటీలో "ఐబీ మాజీ చీఫ్, ఓ ఐటీ కంపెనీ యజమాని, చివరకు ఓ గోమూత్ర నిపుణుడు కూడా ఉన్నారు" అంటూ ఆమె సెటైర్ వేశారు.
ప్రియాంక పరోక్షంగా ప్రస్తావించింది ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త వి.కామకోటి గురించే. 2025లో ఆయన గోమూత్రంపై చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో ప్రియాంక ఈ విమర్శ చేశారు. వాస్తవానికి, ఇటీవలి పేపర్ లీక్ కుంభకోణాల తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రక్షాళన కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఈ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో కామకోటి కూడా సభ్యుడిగా ఉన్నారు.
కామకోటి నేపథ్యమేంటి?
వి.కామకోటి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో ఐఐటీ మద్రాస్ నుంచే పీహెచ్‌డీ పూర్తి చేసి, అక్కడే ఆచార్యుడిగా చేరి 2022లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ వంటి రంగాల్లో ఆయన నిపుణులు. భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి ఇండస్ట్రియల్ గ్రేడ్ మైక్రోప్రాసెసర్ 'శక్తి' రూపకల్పన బృందానికి ఆయనే నాయకత్వం వహించారు.
ఆయన జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ టెక్నాలజీ కమిటీలలో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆయన సేవలకు గాను 2026లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
గోమూత్రంపై వ్యాఖ్యల వివాదం
2025 జనవరిలో చెన్నైలోని ఓ గోశాలలో జరిగిన మాటు పొంగల్ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు. ఆవు మూత్రంలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలున్నాయని, జీర్ణక్రియకు మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, తాను ప్రచురితమైన పరిశోధనల ఆధారంగానే మాట్లాడానని, దేశీయ ఆవులపై తనకున్న ఆసక్తితో ఆ వ్యాఖ్యలు చేశానని కామకోటి వివరణ ఇచ్చారు.
కమిటీలో కామకోటి పాత్ర
ప్రస్తుతం ఎన్‌టీఏ సంస్కరణల కమిటీలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక నిర్మాణం, పారదర్శకత వంటి అంశాలపై కామకోటి సలహాలు ఇవ్వనున్నారు. లక్షల మంది రాసే పరీక్షల్లో స్కోరింగ్ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు, సాంకేతిక భద్రతాపరమైన లోపాలను సరిదిద్దేందుకు ఆయన నైపుణ్యాన్ని వినియోగించుకోనున్నారు.
పరీక్షల సంస్కరణల కమిటీలో గోమూత్ర నిపుణులున్నారన్న ప్రియాంక గాంధీ..
