పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర వివాదానికి దారితీశాయి. పీఓకేలో నిరసనలు చేపడుతున్న వారిని భారత్‌తో సమానంగా శత్రువులుగా చూస్తానంటూ నోరు పారేసుకున్నారు. పాకిస్థాన్‌ భద్రతా బలగాల కాల్పుల్లో గత రెండు రోజుల్లో పీఓకేలో కనీసం 32 మంది కశ్మీరీ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడుతూ ‘‘అక్కడ నిరసన చేస్తున్న వారిని కూడా భారత్‌ను చూసినట్టే చూస్తాను. వాళ్లూ మా శత్రువులే’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఓకేలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ప్రజలను శత్రువులుగా చిత్రీకరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జూన్‌ 5 నుంచి పీఓకేలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మీర్‌పూర్‌ నగరంలో భద్రతా బలగాలు ప్రజలపై నేరుగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు, మృతదేహాలను వాహనాల్లో తరలిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.