పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ సైనికులు, సౌదీ అరేబియా ఇంధన వనరులే లక్ష్యంగా ఇరాన్ అనుకూల గ్రూపులు జరిపిన డ్రోన్ దాడులకు ప్రతిగా అమెరికా, సౌదీ అరేబియా బలగాలు సంయుక్త దాడులు చేపట్టాయి. తూర్పు ఇరాక్‌లోని ఇరాన్ మద్దతున్న గ్రూపులకు చెందిన స్థావరాలపై మంగళవారం వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఒక ప్రకటనలో తెలిపింది.

గత 72 గంటల్లో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఆదేశాలతో 30కి పైగా డ్రోన్ దాడులు జరిగాయని, వాటికి బదులుగానే ఈ ఆపరేషన్ చేపట్టామని సెంట్‌కామ్ పేర్కొంది. అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయని, ఇరాన్ అనుకూల గ్రూపులు ఆయుధాలను నిల్వ ఉంచే ప్రదేశాలు, లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వివరించింది. అయితే, ఈ దాడుల్లో జరిగిన నష్టం లేదా ప్రాణనష్టం వివరాలను సెంట్‌కామ్ వెల్లడించలేదు.  

ఇదే సమయంలో, పశ్చిమాసియాలోని అమెరికా బలగాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని సెంట్‌కామ్ వెల్లడించింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన అన్ని క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని, తమ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఇరాన్ అనుకూల గ్రూపులు అమెరికా పౌరులు, ఆస్తులపై 600కు పైగా దాడులకు ప్రయత్నించాయని సెంట్‌కామ్ గుర్తుచేసింది. "ఐఆర్‌జీసీ, దాని ఉగ్రవాద ప్రాక్సీ గ్రూపులు ఈ దాడులను వెంటనే నిలిపివేయాలి, లేదంటే అమెరికా సైన్యం నుంచి మరిన్ని ప్రతిస్పందనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది.

మరోవైపు, మధ్యప్రాచ్యంలో 20కి పైగా అమెరికా యుద్ధనౌకలు సైనిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని సెంట్‌కామ్ తెలిపింది. ఇరాన్‌పై 'స్టీల్ వాల్ దిగ్బంధం'ను కఠినంగా అమలు చేస్తున్నట్లు, ఇందులో భాగంగా జులై 28 నాటికి 18 వాణిజ్య నౌకలను దారి మళ్లించినట్లు పేర్కొంది.