ప్రభుత్వ వనరుల దుర్వినియోగం, వృథా ఖర్చులకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అర్హులైన ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనాన్ని కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం 'ఒక అధికారికి-ఒకే కారు' విధానాన్ని అమల్లోకి తెస్తూ అధికారిక మెమొరాండం జారీ చేసింది. ప్రభుత్వ వాహనాలను కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే వినియోగించేలా చూడటమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం.
కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పటికే ప్రభుత్వ వాహన సదుపాయం పొందుతున్న అధికారికి.. వేరే మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఇతర స్వయంప్రతిపత్తి సంస్థల్లో అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ, రెండో వాహనాన్ని కేటాయించకూడదని స్పష్టం చేసింది. సదరు అధికారి తన వద్ద ఉన్న వాహనాన్నే ఆ అదనపు బాధ్యతల నిర్వర్తణకు కూడా ఉపయోగించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించింది.
కేవలం వాహనాల సంఖ్యకే ఈ నిబంధనలు పరిమితం కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి లేదా పాక్షిక-ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు వినియోగించడాన్ని కూడా నిషేధించింది. అయితే, అధీకృత అధికారిక పర్యటనలు లేదా విధుల్లో భాగంగా ప్రయాణించేటప్పుడు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
ఈ చర్యల ప్రధాన ఉద్దేశం పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడమని ప్రభుత్వం తెలిపింది. వినియోగంలో లేని లేదా మిగులుగా ఉన్న వాహనాలను అనధికారిక పనులకు వాడకుండా వాటిని సురక్షితంగా భద్రపరచాలని కూడా శాఖలకు సూచించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును బాధ్యతాయుతంగా ఖర్చు చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది.
2022 సెప్టెంబర్‌లో ప్రభుత్వ వాహనాల వినియోగంపై జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాలకు అనుబంధంగా ఈ తాజా ఆదేశాలు వచ్చాయి. ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ఈ సవరించిన నిబంధనలను కఠినంగా పాటించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలను వ్యయ విభాగం ఆదేశించింది.
ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనం.. కేంద్రం కొత్త ఆదేశాలు..
