ఇథనాల్ ఉత్పత్తి కోసం విరిగిన బియ్యాన్ని (నూకలు) కేటాయించడం వల్ల ఆహార ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడటం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
 
దేశంలో బఫర్ నిల్వలు, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) మరియు ఇతర సంక్షేమ పథకాల అవసరాలు తీరిన తర్వాత మిగిలిన అదనపు బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు. భారత ఆహార సంస్థ (FCI) వద్ద మిగులుగా ఉన్న సుమారు 3.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇందుకు వినియోగిస్తున్నట్లు ఆమె తెలిపారు.
 
ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తిలో బియ్యం కంటే మొక్కజొన్ననే ప్రధాన ముడిసరుకుగా వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2025-26 నాటికి దేశంలో మొక్కజొన్న ఉత్పత్తి 55 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, ఇది ఇథనాల్, పౌల్ట్రీ ఫీడ్ మరియు ఇతర అవసరాలకు సరిపోతుందని తెలిపింది. మొక్కజొన్న సాగు వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు స్థిరమైన మార్కెట్ లభిస్తోందని వెల్లడించింది.
 
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం ద్వారా మే 2026 నాటికి దేశానికి రూ.1.90 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, రైతులకు రూ.1.6 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయం లభించిందని ప్రభుత్వం వివరించింది. దేశ ఇంధన భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో కీలకమని ప్రభుత్వం అభివర్ణించింది.