టెక్నాలజీ మన జీవితాలను ఎంతగా సులభతరం చేస్తుందో చెప్పడానికి అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతను ధరించిన యాపిల్ వాచ్ అప్రమత్తమై అత్యవసర సేవలను పిలిచి ప్రాణాలు కాపాడింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం, మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తికి ఆ రోజు ఉదయం నుంచి కాస్త అనారోగ్యంగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెవి దగ్గర నొప్పితో బాధపడుతూ పనికి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. చెత్త పడేయడానికి బయటకు వచ్చిన అతను, ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. "ఎంతసేపు అలా పడి ఉన్నానో నాకు తెలియదు. కళ్లు తెరిచేసరికి నేల మీద ఉన్నాను. లేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో సైరన్ల శబ్దం వినిపించింది" అని ఇస్లాం తెలిపారు.
అతని యాపిల్ వాచ్‌లోని "ఫాల్ డిటెక్షన్" ఫీచర్, అతను కింద పడిపోవడాన్ని గుర్తించింది. అతను నిమిషం పాటు కదలకుండా ఉండటంతో, వాచ్ ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసి, అతని లొకేషన్‌ను షేర్ చేసింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అతన్ని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అతని ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. తన వాచ్ సకాలంలో స్పందించడం వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని ఇస్లాం కృతజ్ఞతలు తెలిపాడు.
యాపిల్ వాచ్‌లలో ఉండే ఈ ఫీచర్, వినియోగదారుడు గట్టిగా కింద పడినప్పుడు గుర్తించి అలర్ట్ పంపుతుంది. యూజర్ స్పందించకపోతే, 30 సెకన్ల కౌంట్‌డౌన్ తర్వాత ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేస్తుంది. 55 ఏళ్లు పైబడిన వారికి ఈ ఫీచర్ డీఫాల్ట్‌గా ఆన్ అయి ఉండగా, ఇతరులు మ్యాన్యువల్‌గా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్... కుప్పకూలిన వ్యక్తికి అండగా నిలిచిన టెక్నాలజీ..
