పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తమ సైనిక బలగాలపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ లక్ష్యంగా కొత్త సైనిక దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణలో ఇది మరో కీలక పరిణామం.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఒక ప్రకటనలో తెలిపింది. "పశ్చిమాసియాలోని అమెరికా బలగాలపై ఇరాన్ చేసిన దాడి ప్రయత్నానికి ఇది గట్టి సమాధానం" అని సెంట్‌కామ్ పేర్కొంది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన 24 గంటల్లోపే ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే, ఇరాన్ క్షిపణులను తమ వాయు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను "చాలా గట్టిగా దెబ్బతీస్తామని" హెచ్చరించారు.
అమెరికా దాడుల తీవ్రత, లక్ష్యాల వివరాలను సెంట్‌కామ్ వెల్లడించనప్పటికీ, ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ ప్రావిన్సులైన హార్మోజ్‌గాన్, ఖుజెస్థాన్‌తో పాటు పర్షియన్ గల్ఫ్‌లోని కొన్ని దీవులపై దాడులు జరిగినట్లు పేర్కొంది. క్వెష్మ్ ద్వీపంలోని నివాస ప్రాంతాలపై దాడులు జరగడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులకు విరామం లభించగా, తాజా ఘటనతో సైనిక చర్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దౌత్యపరమైన ప్రయత్నాలు మరోసారి విఫలమైనట్లు ఈ పరిణామం సూచిస్తోంది. అమెరికా సైన్యం దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే తాము దాడి చేశామని ఇరాన్ గతంలో పేర్కొంది.
మరోవైపు, సైనిక దాడులతో పాటు ఇరాన్‌పై నావికా దిగ్బంధనాన్ని కూడా కఠినతరం చేస్తున్నట్లు సెంట్‌కామ్ వెల్లడించింది. జులై 29 నాటికి 20 వాణిజ్య నౌకలను దారి మళ్లించామని, రెండు నౌకలను నిలిపివేశామని, మరో రెండు నౌకలను తనిఖీ చేశామని సెంట్‌కామ్ తెలిపింది. సైనిక, ఆర్థిక, నావికాపరమైన ఒత్తిడి ద్వారా టెహ్రాన్‌ను కట్టడి చేయాలన్న అమెరికా వ్యూహంలో భాగంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి.
తమ సైనిక స్థావరాలపై దాడికి యత్నించిన ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం..
