టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్, 2023 వన్డే ప్రపంచకప్ హీరో మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. గాయాల నుంచి కోలుకుని, దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ, జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత జట్టుకు దూరమైన షమీ.. తాజాగా శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. దీంతో సెలక్టర్లు ఈ వెటరన్ పేసర్‌ను పక్కనపెట్టి, ముందుకు సాగుతున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది.
ఈ నేపథ్యంలో షమీ పునరాగమన ఆశలపై నీళ్లు చల్లేలా స్పోర్ట్‌స్టార్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, భారత సెలక్షన్ కమిటీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా అన్ని ఫార్మాట్లలో కలిపి 15 మంది యువ ఫాస్ట్ బౌలర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. రాబోయే సంవత్సరాల్లో భారత పేస్ బౌలింగ్ విభాగానికి వీరే వెన్నెముకగా నిలుస్తారని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ 15 మంది జాబితాలో మహ్మద్ షమీ పేరు లేకపోవడం.
సెలక్టర్లు తమ దృష్టిని పూర్తిగా తదుపరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్, 2027 వన్డే ప్రపంచకప్‌పై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞులైన బౌలర్లకు బదులుగా, యువ పేసర్లకు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు అవకాశాలు ఇచ్చి, వారిని భవిష్యత్ కోసం సిద్ధం చేయాలని భావిస్తున్నారు. జట్టులో ఇప్పటికే మొదలైన పరివర్తన ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ స్పందిస్తూ.. జట్టు యాజమాన్యం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. "షమీ ఒక అద్భుతమైన బౌలర్. అలాంటి ఆటగాడిని యాజమాన్యం ఇప్పుడు ఎవరూ పట్టించుకోని వ్యక్తిగా మార్చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది" అని స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు.
ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ వంటి యువ బౌలర్లు కూడా రాణిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఇంకా 15 నెలల సమయం ఉంది కాబట్టి వారిని తక్కువ అంచనా వేయకూడదు. కానీ, షమీని ఇలా పక్కన పెట్టడం సరికాదు" అని అభిప్రాయపడ్డాడు. ఈ పరిణామాలతో షమీ మళ్లీ భారత జెర్సీలో కనిపించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని సంకేతాలు..
