పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను ఉద్దేశించి 'పాకిస్థానీ కశ్మీర్' (Pakistani Kashmir) అని సంబోధిస్తూ కథనం ప్రచురించిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ది న్యూయార్క్ టైమ్స్' వైఖరిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. న్యూయార్క్ టైమ్స్ వాడిన ఈ పదం అత్యంత 'తప్పుదారి పట్టించేదిగా, అవాస్తవంగా' ఉందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం... "పాకిస్థానీ కశ్మీర్ అనేదేదీ లేదు, అక్కడ ఉన్నది కేవలం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన 'పాక్ ఆక్రమిత కశ్మీర్' (PoK) మాత్రమే" అని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, అవి విడదీయరాని భూభాగాలని తెలిపింది. పాకిస్థాన్ ఆయా ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించడమే కాకుండా, అక్కడ నివసిస్తున్న ప్రజలపై హింసకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో స్థానిక ఎన్నికలు, పౌర హక్కుల సమూహాల నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణలపై ప్రచురించిన నివేదికకు న్యూయార్క్ టైమ్స్ 'పాకిస్థానీ కశ్మీర్' అని హెడ్‌లైన్ పెట్టింది. దీనిపై భారత్ దౌత్యపరంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ వేదికలపై దేశ సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా చాటి చెప్పింది.
