తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే అవసరానికి మించి నీటిని తాగడం కూడా ప్రమాదకరమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని ఓవర్‌హైడ్రేషన్ అంటారు. ఇలా ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని సోడియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల స్థాయులు తగ్గి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని హెచ్చరిక సంకేతాలను గుర్తిస్తే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేయవచ్చు.
ఓవర్‌హైడ్రేషన్‌కు ప్రధాన సంకేతాల్లో పూర్తిగా పారదర్శకంగా, పసుపు రంగు లేకుండా మూత్రం రావడం ఒకటి. అలాగే తరచూ తలనొప్పి, వికారం లేదా వాంతులు, కండరాలు పట్టేయడం లేదా ముడుచుకుపోవడం, తీవ్రమైన అలసట, నిద్రమత్తు, చేతులు, కాళ్లు లేదా పెదవులు వాపు రావడం, గందరగోళం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇవి శరీరంలో సోడియం స్థాయులు తగ్గినట్లు సూచిస్తాయి.
ఈ లక్షణాలు స్వల్పంగా ఉంటే నీటి పరిమాణాన్ని తగ్గించి, అవసరమైతే ఎలక్ట్రోలైట్లు ఉన్న పానీయాలు తీసుకోవాలి. అయితే తీవ్రమైన తలనొప్పి, పదేపదే వాంతులు, అయోమయం, స్పృహలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం. ముఖ్యంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు నీటిని తాగే విషయంలో వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
అతిగా నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమేనంటున్న వైద్యులు..
