చాలా మంది చిన్నపిల్లలు నిద్రలో నోరు తెరిచి పడుకోవడం చూస్తుంటాం. తల్లిదండ్రులు దీన్ని సాధారణ అలవాటుగా భావించి పట్టించుకోరు. జలుబు, అలర్జీ వంటి కారణాలతో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే. కానీ రోజూ నోరు తెరిచే నిద్రపోతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శ్వాస సంబంధిత సమస్యకు తొలి సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం వెలువరించింది.

ఎందుకు అలా నిద్రపోతారు?
సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు గాలి శుద్ధి అయి, వేడెక్కి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అయితే ముక్కు మార్గంలో అడ్డంకి ఏర్పడితే గాలి సరిగా వెళ్లదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు నిద్రలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. బయటకు చూస్తే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపించినా.. లోపల శ్వాస సరిగా సాగకపోవచ్చు.

నిద్ర నాణ్యతపై ప్రభావం
నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల పిల్లల నిద్ర మధ్యలో పలుమార్లు భంగం కలిగే అవకాశం ఉంటుంది. దీంతో శరీరానికి అవసరమైన గాఢ నిద్ర దశకు చేరుకోలేరు. విశ్రాంతి పూర్తిగా లభించకపోవడంతో మరుసటి రోజు అలసటగా అనిపించడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

శరీర ఎదుగుదలపైనా ప్రభావమే
ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం శరీరంలో ఆక్సిజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ సమతుల్యతకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటే గుండె ఆరోగ్యం, ఎదుగుదల, మెదడు పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముఖంలోని ఎముకల ఎదుగుదలలో మార్పులు రావడం, పై దవడ సన్నగా మారడం, పళ్లు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని అంటున్నారు.

ప్రవర్తనలోనూ మార్పులు రావచ్చు
రాత్రి సరిగా నిద్రపోని పిల్లల్లో పగటి సమయంలో చిరాకు, హైపర్‌యాక్టివిటీ, అలసట, ఏకాగ్రత లోపం కనిపించవచ్చు. చదువుపైనా దీని ప్రభావం ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఇది కేవలం సాధారణ అలవాటు కాదని, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలు తరచూ నోరు తెరిచి నిద్రపోతుంటే ముందుగా శిశువైద్యుడిని సంప్రదించడం మంచిది. సమస్యకు అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. అలాగే గురక వస్తోందా లేదా గమనించడం, పడకగదిని పరిశుభ్రంగా ఉంచడం, తగినంత నీరు తాగేలా చూడడం వంటి అలవాట్లు కూడా ఉపయోగపడతాయి. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దీర్ఘకాలిక ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.