వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. 82 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఉత్సాహంతో పనిచేస్తున్న బిగ్‌బీ.. ఒకే రోజులో 12 షార్ట్‌ ఫిల్మ్స్‌ షూటింగ్‌తో పాటు రెండు స్టిల్‌ ఫొటోషూట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

తన అభిమానులను ‘ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీ’గా పిలిచే అమితాబ్‌ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘‘పని అంటే పనే. ఈ రోజు 12 షార్ట్‌ ఫిల్మ్స్‌ షూట్‌ చేశాను. రెండు స్టిల్‌ షూట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మీతో కనెక్ట్‌ అవుతున్నాను. మిగతావన్నీ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఈ అనుబంధం మాత్రం ఆగకూడదు’’ అంటూ రాసుకొచ్చారు. పని విషయంలో రాజీ పడకూడదని కూడా పేర్కొన్నారు. రోజూ కొత్తగా నేర్చుకుంటూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలని బ్లాగ్‌లో చెప్పారు. 

ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల ఆయన ‘వెట్టాయన్‌’ చిత్రంలో నటించారు. టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్‌, ఫహద్‌ ఫాసిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.