ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్ సన్) యూట్యూబ్ చరిత్రలోనే ఎవరూ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో 50 కోట్ల మంది సబ్ స్క్రైబర్ల మైలురాయిని అధిగమించారు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగత క్రియేటర్ గా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు నమోదైనా, ఒక వ్యక్తిగత ఛానెల్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం.
ఈ చారిత్రక ఘట్టానికి అభిమానులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. 50 కోట్ల మార్క్ కు చేరువవుతున్న సమయంలో మిస్టర్ బీస్ట్ తన ఛానెల్ లో లైవ్ స్ట్రీమ్ నిర్వహించారు. సబ్ స్క్రైబర్ల సంఖ్య లక్ష్యానికి దగ్గరవుతున్న కొద్దీ వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. చివరి లక్ష మంది సబ్ స్క్రైబర్లు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే చేరడం విశేషం. ఆ తర్వాత ఛానెల్ అధికారికంగా 50 కోట్ల మార్క్ ను దాటి యూట్యూబ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. దీంతో మిస్టర్ బీస్ట్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ విజయం మిస్టర్ బీస్ట్ ను యూట్యూబ్ లో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం ఆయనకు పోటీ ఇచ్చే క్రియేటర్ ఎవరూ దరిదాపుల్లో కూడా లేరు. ఆయన తర్వాత ఉన్న ఛానెళ్లు ఇంకా కొన్ని కోట్ల సబ్ స్క్రైబర్ల దూరంలో ఉన్నాయి. దీన్ని బట్టి గత కొన్నేళ్లుగా ఆయన తన ఆడియన్స్ ను ఎంతగా పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు యూట్యూబ్ లో ప్యూడీపై (PewDiePie) ఆధిపత్యం చెలాయించగా, ఆ తర్వాత కార్పొరేట్ సంస్థ అయిన టీ-సిరీస్ (T-Series) సబ్ స్క్రైబర్ల యుద్ధంలో ముందు నిలిచింది. కానీ, ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వాటన్నింటినీ అధిగమించి వ్యక్తిగత క్రియేటర్ గా తనకంటూ ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు.
యూట్యూబ్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నప్పటికీ, 50 కోట్ల సబ్ స్క్రైబర్లు అనేది ఇంతకుముందు ఏ ఒక్క వ్యక్తిగత క్రియేటర్ కూడా చేరుకోని సంఖ్య. అందుకే ఈ విజయం గత రికార్డుల కంటే చాలా భిన్నంగా నిలుస్తోంది. సంవత్సరాలుగా తన కంటెంట్ తో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ వచ్చిన మిస్టర్ బీస్ట్, ఇప్పుడు యూట్యూబ్ లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. ఆయన ఛానెల్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భవిష్యత్తులో ఈ బెంచ్ మార్క్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్.
