తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కోలీవుడ్ స్టార్ విజయ్ తనదైన స్టైల్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరిపాలన చేపట్టిన కొన్ని రోజులకే తన అసాధారణమైన శైలితో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిన్న ఆయన కర్ణాటకలోని ప్రముఖ కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ దర్శనం ముగించుకున్న తర్వాత ఆయన చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గుడి నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు దాదాపు 130 కిలోమీటర్ల మేర తన కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.

కొల్లూరు మూకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం విజయ్.. అమ్మవారికి 1.6 కేజీల బరువున్న భారీ వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. దాంతో పాటు పట్టుచీర, పండ్లు, పూజా సామగ్రిని అందజేశారు. దర్శనం ముగిసిన వెంటనే తన కాన్వాయ్‌లోని కారు డ్రైవింగ్ సీట్లో ఆయనే కూర్చుని ప్రయాణాన్ని ప్రారంభించారు. దారిలో ఒక టోల్ గేట్ వద్ద అభిమానులు ఆయనను గుర్తుపట్టి కేకలు వేయగా.. విజయ్ ఎంతో వినమ్రంగా స్టీరింగ్ పట్టుకునే నవ్వుతూ చేతులూపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

 

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ పర్యటనకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శించిన మూడో తమిళనాడు సీఎం విజయ్ మాత్రమే. గతంలో తమిళనాడు దిగ్గజ నేతలు ఎం.జి. రామచంద్రన్, జయలలిత మాత్రమే సీఎం హోదాలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు వారి తర్వాత విజయ్ ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేయడం గమనార్హం.

 

జూన్ 22న విజయ్ తన 52వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. బర్త్‌డేకి కొన్ని రోజుల ముందే ఈ ఆధ్యాత్మిక పర్యటన పెట్టుకోవడం.. అలాగే ప్రస్తుతం తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం నడుస్తున్న తరుణంలో ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.