విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్న ప్రతిసారీ కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా తనదేనని స్పష్టం చేశారు. ఇకపై ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఫిన్‌లాండ్‌, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తాను ఒక్కటే చెబుతున్నానని రేవంత్‌ అన్నారు. ‘‘మీ సమస్యలు నాకు వదిలేయండి. మీరు అడగకముందే వాటిని పరిష్కరిస్తాను. ప్రమోషన్లు, బదిలీలు కూడా మీ ఇంటి వద్దకే పంపించాం. ఇకపై మీకోసం కాదు.. విద్యార్థుల సమస్యల కోసం నాతో కొట్లాడండి’’ అని సూచించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని వ్యాఖ్యానించిన రేవంత్‌ రెడ్డి, ఆ లోపు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహిస్తానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 55 రోజుల్లో 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని గుర్తు చేశారు. ఇలాంటి నియామకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులదేనని, అందుకే వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

రాబోయే ఐదేళ్లలో తెలంగాణ విద్యాశాఖను ప్రపంచ దేశాలు ఆదర్శంగా చూసే స్థాయికి తీసుకెళ్లాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. పంచవర్ష ప్రణాళిక తరహాలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిజ్ఞ చేసి పని చేయాలని కోరారు. అలాంటి కృషి చేస్తే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. దేశానికి విద్య, వైద్య రంగాల్లో తెలంగాణే నాయకత్వం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నేరుగా చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు సమయానికి పడేవి కాదని, ఇప్పుడు మాత్రం అడగకుండానే ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు జమ చేస్తున్నామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా అదే రోజు వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు.