ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ మధ్య ఒక భారీ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌కు నెలకు 920 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,600 కోట్లు) చెల్లించేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ అంగీకరించింది. ఈ ఒప్పందం 2026 అక్టోబర్ నుంచి 2029 జూన్ వరకు కొనసాగనుండగా, దీని మొత్తం విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ తమ ఏఐ సేవలకు అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యం కోసం స్పేస్‌ఎక్స్ నుంచి 110,000 ఎన్విడియా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) యాక్సెస్ చేస్తుంది. వీటితో పాటు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), మెమరీ, ఇతర కీలక భాగాలను కూడా వినియోగించుకోనుంది. ఎన్విడియా H200 చిప్‌ల సామర్థ్యం ఆధారంగా చూస్తే, ఈ ఒప్పందం ద్వారా అందే కంప్యూటింగ్ పవర్ 100 మెగావాట్లకు పైగా ఉంటుందని, ఇది ఒకే సమయంలో 75,000 ఇళ్లకు విద్యుత్తును అందించగల శక్తితో సమానమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తమ ఏఐ సేవలకు, ముఖ్యంగా 'జెమిని ఎంటర్‌ప్రైజ్' ప్లాట్‌ఫామ్‌కు అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికే ఈ ఒప్పందం చేసుకున్నట్లు గూగుల్ క్లౌడ్ ప్రతినిధి తెలిపారు. ఇది ఒక స్వల్పకాలిక, సమయానుకూల ఒప్పందమని, పెరిగిన కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా తాత్కాలిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. ఒప్పందంలో భాగంగా 2026 సెప్టెంబర్ 30 నాటికి స్పేస్‌ఎక్స్ ఈ చిప్‌లను అందించడంలో విఫలమైతే, ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు గూగుల్‌కు ఉంటుంది.

ఇదివరకే స్పేస్‌ఎక్స్, ఆంత్రోపిక్ పీబీసీ అనే మరో సంస్థతోనూ ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన మరో సంస్థ ఎక్స్ఏఐ (xAI) కూడా సొంతంగా డేటా సెంటర్లను నిర్మిస్తోంది. కాగా, స్పేస్‌ఎక్స్‌లో గూగుల్‌కు సుమారు 5% వాటా ఉండటం గమనార్హం. ఈ తాజా డీల్, ఏఐ రంగంలో కంప్యూటింగ్ పవర్‌కు ఎంతటి ప్రాధాన్యం ఉందో స్పష్టం చేస్తోంది.